BCCI-Virat kohli Row: ఆ వ్యాఖ్యల తర్వాత విరాట్ కోహ్లికి షోకాజ్ నోటీసులు ఇద్దామనుకున్న బీసీసీఐ చీఫ్.. కానీ..

First Published Jan 20, 2022, 5:48 PM IST

Virat Kohli-Sourav Ganguly Row: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి మధ్య  విబేధాలకు సంబంధించిన మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. 
 

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి.. బీసీసీఐ చీఫ్  సౌరవ్ గంగూలీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయా..? అంటే అవుననే అనిపిస్తున్నది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వార్తను బట్టి అది నిజమనిపించకమానదు.  కోహ్లి.. తనపై చేసిన వ్యాఖ్యలపై  గంగూలీ ఏకంగా అతడికి షోకాజ్ నోటీసులు  జారీ చేయాలని భావించాడట.. 

గతేడాది సెప్టెంబర్ లో టీ20 క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లితో.. తాను మాట్లాడానని,  ఆ ఆలోచనను విరమించుకోవాలని  గంగూలీ గతంలో చెప్పాడు.  భారత జట్టుకు  వివిధ ఫార్మాట్లలో వివిధ కెప్టెన్ల సంస్కృతి మంచిది కాదని తనతో చర్చించినట్టు కూడా గంగూలీ  తెలిపాడు.  

కాగా..  తదనంతర పరిస్థితులలో వన్డే కెప్టెన్సీ కూడా కోల్పోయిన కోహ్లి.. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీలక  వ్యాఖ్యలు చేశాడు.  గంగూలీ గానీ, బీసీసీఐ కి సంబంధించి ఏ ఒక్క ప్రతినిధి గానీ తాను టీ20 నుంచి వైదొలిగినప్పుడు తనతో మాట్లాడలేదని వ్యాఖ్యానించాడు. గంగూలీ అలా ఎందుకు చెప్పాడో తనకు తెలియదని, ఈ విషయంలో ఆయననే స్పష్టత కోరాలని  కోహ్లి మీడియాతో అన్నాడు. 

కోహ్లి చేసిన ఈ వ్యాఖ్యలపై గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశాడట. 'India Ahead News’ కథనం ప్రకారం.. విరాట్ వ్యాఖ్యలపై  కోపంగా ఉన్న గంగూలీ.. అతడికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయాలని భావించాడని సమాచారం.  

తనపై కోహ్లి చేసిన వ్యాఖ్యలపై గంగూలీ  మనసు నొచ్చుకుందని బోర్డులోని కీలక వ్యక్తి సదరు కథనంలో వెల్లడించాడు. అయితే గంగూలీని బీసీసీఐ పెద్దలు  ఆపారని, లేకుంటే అతడు కోహ్లికి షోకాజ్ నోటీసులు జారీ చేసేవాడని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపినట్టు ఆ కథనాన్ని బట్టి తెలుస్తున్నది. 

అప్పటికే రోహిత్ శర్మ-విరాట్ కోహ్లి-బీసీసీఐ ల తీరుపై భారత క్రికెట్ లో మునుపెన్నడూ లేనంత చర్చ జరుగుతున్న తరుణంలో ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయొద్దని గంగూలీకి బోర్డులోని పెద్దలు సూచించడంతో  దాదా ఆ ఆలోచనను విరమించుకున్నాడని సమాచారం. 

వివాదాలు, విబేధాల నడుమే కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరాడు. అక్కడ సిరీస్ నెగ్గి సెలెక్టర్లతో పాటు తనపై విమర్శలు చేస్తున్న నోర్లు మూయిస్తాడని అతడి అభిమానులు అనుకుంటే.. కోహ్లి మాత్రం పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కున్నాడు. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా.. తర్వాత రెండు టెస్టులలో దారుణ పరాజయం మూటగట్టుకుంది.  ఫలితంగా అలవోకగా నెగ్గుతుందన్న సిరీస్ కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో  కోహ్లి తనకు మిగిలిన టెస్టు  కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. 

click me!