The Captain Kings of IPL 2025: ఐపీఎల్ 2025 ఉత్కంఠగా సాగుతోంది. ధనాధన్ ఇన్నింగ్స్ లతో పాటు అదిపోయే బౌలింగ్, సూపర్ ఫీల్డింగ్ తో క్రికెట్ లవర్స్ కు మస్తు మజాను పంచుతోంది. ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్ 4లో దూసుకుపోతున్నాయి. ఇదే సమయంలో ఒక్క విషయం ఫ్యాన్స్ మైండ్ బ్లో చేస్తోంది. అదే కెప్టెన్లుగా, ప్లేయర్లు అదరగొడుతూ సునామీ రేపుతున్నారు పలువురు స్టార్లు. కెప్టెన్ గా, బ్యాట్స్‌మెన్ గా బీస్ట్ మోడ్ లోకి ఎంటరై అదరగొడుతున్న టాప్ సూపర్ హిట్ కెప్టెన్లు ఎవరో చూద్దాం.
1. అజింక్య రహానే
రహానే తన సూపర్ బ్యాటింగ్ స్కిల్స్ తో పాటు అద్భుతమైన కెప్టెన్సీ సెన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ను విన్నింగ్ ట్రాక్ లో దూసుకుపోయేలా చేస్తున్నాడు. ఈ 36 ఏళ్ల ఈ సీనియర్ స్టార్ రహానే కెప్టెన్సీలో కేకేఆర్ జట్టు 6 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. కెప్టెన్‌గా స్ట్రాటజీ గేమ్‌లో దిట్టగా, బ్యాటింగ్‌లోనూ హాట్ ఫామ్‌లో ఉన్నాడు రహానే.
రహానే 6 మ్యాచ్‌ల్లో 204 పరుగులు చేశాడు. 40.80 సగటు, 154 స్ట్రైక్ రేటుతో సాగిన తన బ్యాట్ తో రహానే 2 హాఫ్ సెంచరీలు బాదాడు. టాప్ రన్ స్కోరర్లలో 7వ స్థానంలో ఉన్నాడు.
2. రజత్ పటీదార్
రజత్ పాటిదార్ కెప్టెన్ గా మారిన తర్వాత సైలెంట్ అటాకర్ గా అదిరిపోయే ఇన్నింగ్స్ లను ఆడుతున్నాడు. ఈ బెంగళూరు బాయ్‌కి కెప్టెన్సీ ఇచ్చారంటే అతని ఆట, కెప్టెన్సీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పటిదార్ కెప్టెన్సీలో ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ 3 మ్యాచ్ లు గెలుచుకుని పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది.
పాటిదార్ 5 మ్యాచ్‌ల్లో 186 పరుగులు చేశాడు. 37.20 సగటు, 161 స్ట్రైక్ రేటుతో సాగిన తన బ్యాటింగ్ లో 2 హాఫ్ సెంచరీలు బాదాడు. సింపుల్ షాట్లు… స్ట్రాంగ్ మైండ్‌సెట్‌తో పటీదార్ ఇప్పుడు IPL టాప్ ఫేవరెట్ కెప్టెన్లలో ఒకడిగా మారాడు.
3. శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ లో రెండో అత్యంత ఖరీదైన కెప్టెన్. అందుకు తగ్గట్టుగానే బ్యాటింగ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ లతో పాటు కెప్టెన్ గా కూడా అదరగొడుతున్నాడు. పంజాబ్ టీమ్ అయ్యర్ కోసం 26.75 కోట్లు వెచ్చించి తీసుకున్నప్పుడు చాలా మంది పెదవి విరస్తూ ఆశ్చర్యపోయారు. కానీ, ఇప్పుడు ఆ డబ్బులు వర్త్ అని నిరూపిస్తున్నాడు.
శ్రేయాస్ అయ్యర్ 5 మ్యాచ్‌ల్లో 250 పరుగులు చేశాడు. 83 సగటు, 208 స్ట్రైక్ రేటుతో సాగిన అతని బ్యాటింగ్ లో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గుజరాత్ పై 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను కూడా ఆడాడు. హైదరాబాద్ టీమ్ పై 82 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. అయ్యర్ ఇప్పుడు రన్ మిషన్ మోడ్ లో ఉన్నాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో టాప్ 4 లో ఉన్నాడు. ఇదే ఫామ్ కొనసాగితే పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్‌కి చేరుకోవడం పక్కా.
4. శుభ్ మన్ గిల్
గుజరాత్ టైటాన్స్‌కి ఓ క్రికెటింగ్ కింగ్ దొరికాడు అతడే శుభ్‌మన్ గిల్.. బ్యాట్‌తోనే కాదు… బ్రెయిన్‌తోనూ అద్భుతమైన కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. IPL 2025లో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా గెలుపు రూట్‌లో దూసుకెళ్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్ లను ఆడి 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. గిల్ ఇదే జోరు కొనసాగిస్తే గుజరాత్ టైటాన్స్ టైటిల్ ఎగరేసుకుపోయే టీమ్ గా పోటీలో ఉండటం పక్కా.
కెప్టెన్సీలో విజయవంతంగా గుజరాత్ ను నడిపిస్తున్న శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ లో కూడా అదరగొడుతున్నాడు. గిల్ 6 మ్యాచ్ లు ఆడి 41 సగటు, 149 స్ట్రైక్ రేటుతో 208 పరుగులు చేశాడు. 2 హాఫ్ సెంచరీలు కూడా బాదాడు.