ఐసీసీ టోర్నీలలో టీమిండియా వరుస వైఫల్యాలకు ప్రధాన కారణమదే : సునీల్ గవాస్కర్

First Published Jan 21, 2022, 2:17 PM IST

Sunil Gavaskar:  2013 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన అనంతరం భారత జట్టు ఈ మెగా టోర్నీలలో దారుణంగా చతికిలపడుతున్నది. సుమారు పదేండ్లుగా భారత జట్టు ఐసీసీ కప్ కోసం చూస్తూనే ఉన్నది. 
 

1983లో జరిగిన వన్డే ప్రపంచ కప్ విజయం అనంతరం భారత్.. తిరిగి దానిని సాధించడానికి సుమారు ముప్పై ఏండ్లు పట్టింది. 2011 లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని  టీమిండియా.. వన్డే ప్రపంచకప్ ను సగర్వంగా ముద్దాడింది. ఆ తర్వాత 2013 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది.

ఆ తర్వాత భారత్ మళ్లీ ఐసీసీ  ట్రోఫీ నెగ్గలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత 2015, 2019లలో వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ,  రెండు టీ 20 ప్రపంచకప్ లు, ఒక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిన్ జరిగినా.. ఒక్కదాంట్లో కూడా భారత్ విజయాలు సాధించలేదు. గతేడాది ముగిసిన టీ20  ప్రపంచకప్ లో కూడా విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిబాట పట్టింది. 

తాజాగా దీనిపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ సారథి సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  నిఖార్సైన ఆల్ రౌండర్ల లేమి టీమిండియాను వేధిస్తున్నదని.. అందుకే భారత జట్టు ఐసీసీ ట్రోఫీలలో  వరుసగా విఫలమవుతుందని  అన్నాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు తొలి వన్డేలో ఓటమి నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ఐసీసీ టోర్నీలలో భారత జట్టు వరుస వైఫల్యాలకు కారణం మనకు నిఖార్సైన ఆల్ రౌండర్లు  కొరవడటమే. 

1983 లో  వన్డే ప్రపంచకప్, 1985లో వరల్డ్ ఛాంపియన్షిప్, 2011 వన్డే  వరల్డ్ కప్ గెలిచిన జట్లను చూడండి. ఆ జట్లలో  మంచి ఆల్ రౌండర్లున్నారు...’ అని తెలిపాడు. 1983లో కపిల్ దేవ్, మోహిందర్ అమర్నాథ్, మదన్ లాల్ వంటి  ఆల్ రౌండర్లు ఉండగా.. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, రవి అశ్విన్ వంటి ఆల్ రౌండర్లు ఉన్నారు.  2011 మెగా టోర్నీలో యువరాజ్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. 

ఇదే విషయమై  సన్నీ స్పందిస్తూ.. ‘గతంలో చాలా మంది బ్యాటింగ్ తో పాటు బౌలింగ్.. బౌలర్లు కూడా బ్యాటింగ్ చేసేవాళ్లు. ముఖ్యంగా 6, 7, 8 వ స్థానాలలో ఉండే ఆటగాళ్లు  అత్యంత కీలకం. ఆ స్థానాల్లో ఆల్ రౌండర్లు ఉన్న జట్లకు విజయాల శాతం ఎక్కువగా ఉంటుంది.  

భారత్ కు గతంలో ఆ స్థానాల్లో యువరాజ్ సింగ్, సురేశ్  రైనా వంటి ఆటగాళ్లు ఉండేవాళ్లు. యువీ, రైనా లు బ్యాటింగే కాకుండా బౌలింగ్ కూడా చేసేవాళ్లు. కీలక భాగస్వామ్యాలను విడదీసేవాల్లు. కానీ  గత రెండు, మూడేండ్లుగా టీమిండియాలో ఇలాంటి ఆల్ రౌండర్ కరువయ్యాడు.  దీంతో కెప్టెన్ కు ఆప్షన్లు కూడా ఎక్కువగా ఉండటం లేదు...’ అని  వివరించాడు. 
 

click me!