ఆర్‌సీబీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టిన శ్రీకర్ భరత్... ఈసారి అయినా తెలుగు కుర్రాడికి అవకాశం దక్కేనా...

First Published Sep 16, 2021, 1:35 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్, ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది...

ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే సిక్సర్ల మోత మగించి, సెంచరీ చేసిన ఏబీ డివిల్లియర్స్, లీగ్ మొదలయ్యాక ప్రత్యర్థి బౌలర్లపై ఏ స్థాయిలో విరుచుకుపడతాడోనని మిగిలిన ఫ్రాంఛైజీల అభిమానులు భయపడుతున్నారు...

46 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 104 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్... లీగ్ ప్రారంభానికి ముందే భీకరమైన ఫామ్‌లోకి రావడంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఫుల్లు ఖుష్ అవుతున్నారు...

అయితే ఏబీడీ సెంచరీ చేసినా, తన జట్టుకి విజయాన్ని అందించలేకపోయాడు. కారణం ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీ మార్కు అందుకోలేకపోయినా 95 పరుగులతో అదరగొట్టిన తెలుగు కుర్రాడు కోన శ్రీకర్ భరత్...

దేవ్‌దత్ పడిక్కల్ ఎలెవన్ జట్టు తరుపున ఆడిన శ్రీకర్ భరత్, 47 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 95 పరుగులు చేసి... తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు...

గత సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన దేవ్‌దత్ పడిక్కల్ 21 బంతుల్లో 36 పరుగులు చేసి రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

దేశవాళీ క్రికెట్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ... సెలక్టర్ల దృష్టిలో చాలాసార్లు పడ్డాడు శ్రీకర్ భరత్. ఇప్పటికే చాలాసార్లు టెస్టుల్లో, వన్డే జట్లలో శ్రీకర్ భరత్‌కి చోటు దక్కింది. అయితే తుది జట్టులో మాత్రం ఇప్పటిదాకా ఒక్క అవకాశం కూడా రాలేదు...

తన కెరీర్‌లో 69 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన శ్రీకర్ భరత్, 8 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో 3909 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 308 పరుగులు...

2015లో ఢిల్లీ జట్టు బేస్ ప్రైజ్ రూ.10 లక్షలకు శ్రీకర్ భరత్‌ను కొనుగోలు చేసింది. అయితే సీజన్‌లో ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు... 

2021 ఐపీఎల్ వేలంలో ఆర్‌సీబీ, శ్రీకర్‌ను బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది. మొదటి ఫేజ్‌లో మనోడికి ఒక్క అవకాశం కూడా రాలేదు. ప్రాక్టీస్ మ్యాచులో దాదాపు సెంచరీ మార్కు అందుకున్న శ్రీకర్‌కి ఈసారి అయినా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు తెలుగు అభిమానులు...

ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో వృద్ధిమాన్ సాహా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లే భారత జట్టులో కవర్ ప్లేయర్‌గా క్వారంటైన్ గడిపాడు శ్రీకర్ భరత్...

అయితే తీరా ఇంగ్లాండ్ టూర్‌కి బయలుదేరే సమయానికి సాహా కోలుకోవడంతో శ్రీకర్ భరత్‌ను ఇక్కడే వదిలేసి, వెళ్లిపోయింది భారతజట్టు...

వరుసగా అవకాశాలు వచ్చినట్టే వచ్చి, జారిపోతున్నా పట్టువదలకుండా ప్రయత్నిస్తున్న శ్రీకర్ లాంటి సత్తా ఉన్న క్రికెటర్లకు కనీస గుర్తింపు రావాలంటే... ఐపీఎల్‌లో ఆడించాలని కోహ్లీని కోరుతున్నారు క్రికెట ఫ్యాన్స్.

click me!