షార్జా వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2021 సీజన్ లో 41 వ మ్యాచ్ గా జరుగుతున్న ఈ పోరులో పై చేయి సాధించాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి.
పాయింట్ల పట్టికలో చెన్నైతో సమానంగా పాయింట్లు కలిగినా నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. పది మ్యాచులాడిన ఢిల్లీ 8 విజయాలు 16 పాయింట్లంతో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోశాలని ఆ జట్టు భావిస్తున్నది.
ఇక ఆడిన పది మ్యచ్ లకు గాను నాలుగు విజయాలు, 6 ఓటములతో మొత్తంగా 8 పాయింట్లు సాధించి పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కోల్కతా.. ప్లే ఆఫ్స్ చేరుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ లోనూ గెలిచితీరాలి.
ప్లే ఆఫ్స్ లో ఇప్పటికే ఢిల్లీ, చెన్నై బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా.. రేసులో బెంగళూరు కూడా ఉంది. కానీ నాలుగో స్థానం కోసం కోల్కతా, పంజాబ్, ముంబయి, కోల్కతా ల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.
గత మ్యాచ్ లో చెన్నైతో ఓడిన కోల్కతా ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోవడంతో ఆ జట్టుకు ఈ విజయం అత్యావశ్యకం కానున్నది.
ఇక బలాబలాల విషయానికొస్తే.. ఢిల్లీలో బ్యాటర్లకు కొదవలేదు. ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ శిఖర్ ధావన్ ఫుల్ ఫామ్ లో ఉండగా శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, రిషిబ్ పంత్ టచ్ లోకి రావడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. బౌలింగ్ లో కూడా రబాడా, నార్త్జ్ ఇరగదీస్తున్నారు.
బ్యాటింగ్ లో కోల్కతా సైతం ఢిల్లీ తో సమఉజ్జిగానే ఉంది. రాహుల్ త్రిపాఠి, వెంకటేష్ అయ్యర్, మోర్గాన్, ఆండ్రూ రసెల్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. గత మ్యాచ్ లో దినేశ్ కార్తీక్, రానా కూడా ఇరగదీశారు. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఫర్వాలేదనిపిస్తున్నారు. వీరికి తోడు తాజాగా ఫెర్గుసన్ చేరడం ఆ జట్టు బౌలింగ్ బలాన్ని పెంచేదే. స్టార్లంతా మరోసారి రాణిస్తే ఢిల్లీని ఓడించడం కేకేఆర్ కు పెద్ద కష్టమేమీ కాదు.
ఇరు జట్లు 27 సార్లు తలపడగా.. కేకేఆర్ 14 సార్లు గెలువగా ఢిల్లీ 12 సార్లు నెగ్గింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఈ సీజన్ లో భాగంగా గత ఏప్రిల్ లో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడం ఆ జట్టుకు లాభించే అంశం. కాగా, రెండు జట్లు పెద్దగా మార్పులేమీ లేకుండానే దిగాలని భావిస్తున్నాయి.