మరొకరి భార్యను పెళ్లి చేసుకుని కోర్టుల చుట్టూ తిరిగిన కుంబ్లే.. జంబో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తెలుసా..?

First Published Oct 17, 2021, 11:50 AM IST

Happy Birthday Anil Kumble: భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్,  ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు మార్గదర్శకుడుగా ఉన్న అనిల్ కుంబ్లే ఇవాల 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. భారత క్రికెట్ అభిమానులు జంబో అని ముద్దుగా పిలుచుకునే ఈ మాజీ లెగ్  స్పిన్నర్  ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉంది. ఓ వివాహిత మహిళతో ప్రేమలో పడటం నుండి వారి కుమార్తె కోసం చాలా కాలం పాటు అనిల్ కుంబ్లే కోర్టుల చుట్టూ తిరిగాడు. అందుకు సంబంధించిన కథా కమామీషు ఏంటో చూద్దాం. 

కర్నాటకకు చెందిన అనిల్ కుంబ్లే (Anil Kumble) 1970 అక్టోబర్ 17 న బెంగళూరులో కృష్ణ స్వామి, సరోజ దంపతులకు జన్మించాడు. 1992 లో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ తీసుకున్న కుంబ్లేకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే అమితాసక్తి. తన 19 వ ఏట మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో కుంబ్లే టెస్ట్ కెరీర్‌ను ఆరంభించాడు. 
 

భారత జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందించిన కుంబ్లే.. 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో చేసిన ప్రదర్శనను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. పాకిస్తాన్ (Pakistan) పై జరిగిన ఆ మ్యాచ్ లో కుంబ్లే.. ఒకే ఇన్నింగ్స్ లో ఏకంగా పది వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటివరకూ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. 

ఇండియాలో అత్యంత విజయవంతమైన స్పిన్నర్ గా గుర్తింపు పొందిన కుంబ్లే ప్రేమ, పెళ్లి కూడా వార్తల్లో నిలిచింది. ప్రపంచ  అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ చాలా మందిని తన లెగ్ స్పిన్ తో ఇబ్బందులు పెట్టిన కుంబ్లే.. కర్నాటక కే చెందిన చేతన రామతీర్థ (Chethana Ramatheertha) వేసిన గూగ్లీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసే చేతనను చూసిన తొలి చూపులోనే కుంబ్లే ప్రేమలో పడ్డాడు. తొలుత స్నేహంగా మొదలైన ఆ పరిచయం తర్వాత పెళ్లికి దారి తీసింది. అయితే అప్పటికే ఆమెకు పెళ్లి అయి ఒక కూతురు కూడా ఉంది. 1986 లోనే మైసూరుకు చెందిన ఒక వ్యక్తితో అప్పటికే చేతన వివాహం జరిగింది. వారికి ఒక కూతురు. పేరు అరుణి. 

చేతనా.. భర్తకు మనస్పర్థలు వచ్చి అతడితో దూరంగా బతికింది. కుంబ్లే పరిచయం అయిన తర్వాత 1998లో ఆమె మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. 1999లో కుంబ్లే-చేతన వివాహం చేసుకున్నారు. 

అయితే పెళ్లి తర్వాత కూడా కుంబ్లే.. చేతనలు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. 1998 నుంచి 2004 దాకా ఈ దంపతులిద్దరూ కోర్టు మెట్లెక్కారు. చేతన మొదటి భర్తకు కలిగిన సంతానం.. అరుణి ని తనకు అప్పగించాలని అతడు కోర్టులో కేసు వేశాడు. 

కానీ చేతన మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కుంబ్లే కూడా అరుణిని తన కూతురుగానే  చూసుకున్నాడు.  పెళ్లి తర్వాత కుంబ్లే-చేతనలకు ఇద్దరు సంతానం కలిగారు. వారి పేర్లు మాయ, స్వస్తి. కుంబ్లే తన సంతానంతో పాటు అరుణిని కూడా సొంత బిడ్డలాగే చూసుకున్నాడు. 

చివరికి 2004 లో కోర్టు అరుణిని చేతనకే అప్పగించింది. దీంతో అప్పట్నుంచి కుంబ్లే కుటుంబం ఆనందంగా జీవితం గడుపుతుంది. క్రికెట్ తో పాటు కుటుంబాన్ని కూడా కుంబ్లే చాలా ప్రేమిస్తాడు. 

వ్యక్తిగత జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కుంబ్లే మాత్రం ఆ ప్రభావాన్ని ఆటమీద పడనీయలేదు. టెస్టు క్రికెట్ కెరీర్ లో 132 మ్యాచ్ లు ఆడిన కుంబ్లే.. 619 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 337 వికెట్లు తీశాడు. 2012 లో క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన ఈ జంబో.. ఐసీసీ క్రికెట్ కమిటీకి అధిపతిగా ఉన్నాడు.

click me!