పాకిస్తాన్‌లో 2023 ఆసియా కప్, నిర్వహణ హక్కులను సొంతం చేసుకున్న పాక్... భారత జట్టు వెళ్తుందా?...

First Published Oct 16, 2021, 3:49 PM IST

2022లో టీ20 ఫార్మాట్‌లో శ్రీలంకలో ఆసియా కప్... ఆ తర్వాతి ఏడాది పాక్‌లో వన్డే ఫార్మాట్‌లో ఆసియాకప్... చివరిసారిగా 2008లో ఆసియాకప్‌ను నిర్వహించిన పాకిస్తాన్...

ఐసీసీ టోర్నీలు, కరోనా, ఇతరత్రా కారణాల వల్ల రెండు సీజన్లుగా ఆసియా కప్ టోర్నీ నిర్వహించడం వీలు కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్- జూలై నెలల్లో శ్రీలంక వేదికగా ఆసియా కప్ నిర్వహించాల్సి ఉంది.

అయితే భారత జట్టు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించడంతో పాటు కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది సాధ్యం కాలేదు...

అయితే వచ్చే ఏడాది శ్రీలంకలో, ఆ తర్వాత 2023లో పాకిస్తాన్‌లో ఆసియా కప్ టోర్నీని నిర్వహించబోతున్నట్టు తెలిపాడు పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా... 2022లో శ్రీలంక జరిగే ఆసియా కప్ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో, ఆ తర్వాత పాక్‌లో జరిగే టోర్నీని వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తామని తెలిపాడు...

2008లో చివరిసారిగా పాకిస్తాన్‌లో ఆసియా కప్ టోర్నీ జరిగింది...  ఆ తర్వాత ఆడపాదడపా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు పాక్‌లో పర్యటిస్తున్నా, ఆసియా కప్ లాంటి మల్టీ నేషన్ టోర్నమెంట్ ఏదో గత 14 ఏళ్లుగా అక్కడ జరగలేదు...

ఈ నెల ఆరంభంలో పాక్‌లో పర్యటించడానికి అంగీకరించి, ఆ దేశానికి చేరుకుని క్వారంటైన్ కూడా పూర్తిచేసుకున్న న్యూజిలాండ్ జట్టు, టూర్ ఆరంభానికి ముందు ‘భద్రతా కారణాల దృష్ట్యా’ సిరీస్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది... ఈ సంఘటన తర్వాత ఇంగ్లాండ్ జట్టు కూడా పాక్ టూర్‌ను క్యాన్సిల్ చేసుకుంది...

ఇలాంటి సందర్భాల్లో భారత జట్టు, పాక్‌లో పర్యటించడానికి ఇష్టపడుతుందా? అనేది అనుమానంగా మారింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ నుంచి ఆసియాకప్ టోర్నీ ఆతిథ్య హక్కులను సొంతం చేసుకున్న పాక్, ఎన్నో ఏళ్లుగా భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం లేదంటూ ఆరోపణలు చేస్తోంది...

2012లో భారత్, పాక్ మధ్య చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అదే ఏడాది భారత్‌లో జరిగిన ఉగ్రదాడిలో పాక్ ప్రమేయం ఉందని తేలడంతో ఆ జట్టుతో సిరీస్‌లు ఆడడం మానేసింది భారత జట్టు...

ఇప్పుడు ఆసియా కప్ టోర్నీ కోసం పాక్‌లో పర్యటించేందుకు భారత జట్టు ఏ మాత్రం అంగీకరించకపోవచ్చు. అదే జరిగితే టీమిండియా లేకుండానే ఆసియా కప్ 2023 టోర్నీ జరగొచ్చు. 

శ్రీలంకలో  చివరిసారిగా 2010లో ఆసియా కప్ టోర్నీ జరిగింది. ఆసియా కప్ నిర్వహించి ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయింది. చివరిసారిగా 2018లో తటస్థ వేదిక యూఏఈలో నిర్వహించిన ఆసియా కప్ టోర్నీని రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా గెలిచింది.

click me!