
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తన 18వ సీజన్‌కు రెడీ అయింది. క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎవురుచూస్తున్న ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ లు తలపడనున్నాయి. అయితే, ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటిరవకు నమోదైన అత్యంత విజయవంతమైన రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై, చెన్నై. ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనేక విజయాలు సాధించాయి. రెండూ చెరో ఐదు టైటిళ్లను గెలుచుకున్నాయి. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ లో ఛాంపియన్ గా నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మూడు టైటిళ్లతో తర్వాతి స్థానంలో ఉంది. కేకేఆర్ 2012, 2014, 2024లో ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు ఎవరు?
ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్న కోహ్లీ 8,004 పరుగులతో ఆల్ టైమ్ రన్ చార్టులలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ (6,769), రోహిత్ శర్మ (6,628), డేవిడ్ వార్నర్ (6565), సురేష్ రైనా (5528) ఉన్నారు. వీరు చాలా సార్లు అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు.
ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన ప్లేయర్లు ఎవరు?
ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ప్లేయర్ క్రిస్ గేల్. పూణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున క్రిస్ గేల్ 66 బంతుల్లో 175 పరుగుల ఇన్నింగ్స్ తో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఆ తర్వాత బ్రెండన్ మెకల్లమ్ 158* (KKR vs RCB), క్వింటన్ డి కాక్ 140* (LSG vs KKR), AB డివిలియర్స్ 133* (RCB vs MI), KL రాహుల్ 132* పరుగుల ఇన్నింగ్స్ లు ఉన్నాయి.
ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరు?
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చాహల్. అలాగే, ఐపీఎల్ లో 200 వికెట్ల మార్కును అందుకున్న ఏకైక ప్లేయర్ చాహల్. ఐపీఎల్ లో యుజ్వేంద్ర చాహల్ 205 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. తర్వాత పియూష్ చావ్లా (192), డ్వేన్ బ్రావో (183), భువనేశ్వర్ కుమార్ (181) ఉన్నారు.
ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు ఎవరు?
ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. సీఎస్‌కే దిగ్గజం ధోని 264* ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ధోని తర్వాత దినేష్ కార్తీక్ (257), రోహిత్ శర్మ (257), విరాట్ కోహ్లీ (252)లు ఉన్నారు.
ఐపీఎల్ లో ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్ ఎవరు?
ఐపీఎల్ లో అత్యధిక క్యాచ్ లను పట్టిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. బ్యాట్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా అద్భుతం చేశాడు కోహ్లీ. విరాట్ కోహ్లీ 114 క్యాచ్‌లతో టాప్‌లో ఉన్నాడు. తర్వాత సురేష్ రైనా (109), కీరన్ పొలార్డ్ (103), రవీంద్ర జడేజా (103)లు ఉన్నారు.
ఐపీఎల్ లో అతిపెద్ద విజయాలు సాధించింది ఎవరు?
ముంబై ఇండియన్స్ 146 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచి ఐపీఎల్ లో అతి పెద్ద గెలుపు రికార్డు సాధించింది. ఆర్‌సీబీ వేర్వేరు జట్లపై 144, 140, 138, 130 పరుగుల తేడాతో గెలిచింది. బిగ్గెస్ట్ విన్నింగ్ గేమ్ లు సాధించింది.
ఐపీఎల్ లో అత్యల్ప, అత్యధిక టీమ్ స్కోర్లు ఎవరు సాధించారు?
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఆర్‌సీబీపై 287/3 రన్స్ చేసి ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. ఆర్‌సీబీ కేకేఆర్‌పై 49 రన్స్‌కే ఆలౌట్ అయి అత్యల్ప స్కోర్ నమోదుచేసింది.