ఓ వైపు కరణ్ నాయర్ త్రిబుల్ సెంచరీ... మరో వైపు 36 పరుగులకే ఆలౌట్... టీమిండియాకి ఈరోజుతో...

First Published Dec 19, 2021, 1:43 PM IST

భారత క్రికెట్ చరిత్రలో డిసెంబర్ 19కి ఓ స్పెషల్ గుర్తింపు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కొన్ని డేట్స్‌ బాగా కలిసిరావచ్చు, మరికొన్ని అసలు కలిసి రాకపోవచ్చు. అయితే సరిగా ఇదే రోజున టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత జట్టు, అత్యల్ప స్కోరు కూడా చేసింది...

డిసెంబర్ 19, 2016న ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 759 పరుగుల భారీ స్కోరు చేసింది.

భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 477 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మొయిన్ ఆలీ 146 పరుగులు చేయగా, జో రూట్ 88, లియామ్ డాసన్ 66, అదిల్ రషీద్ 60 పరుగులు చేశారు... 

భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 759/7 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ 311 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లతో 199 పరుగులు చేసి, డబుల్ సెంచరీకి ఒక్క పరుగు ముందు అవుట్ అయ్యాడు...

పార్థివ్ పటేల్ 71 పరుగులు చేయగా, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కరణ్ నాయర్ 381 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 303 పరుగులు చేశాడు...

వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత భారత జట్టు తరుపున టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కరణ్ నాయర్... 

రవిచంద్రన్ అశ్విన్ 67 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా 51 పరుగులు చేశాడు. 190.4 ఓవర్ల పాటు 3.98 రన్‌రేట్‌తో పరుగలు చేసిన భారత జట్టు, 282 పరుగుల ఆధిక్యం తర్వాత డిక్లేర్ చేసింది...

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత జట్టుకి 75 పరుగుల తేడాతో విజయం దక్కంది. కరణ్ నాయర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలవగా, ఈ టెస్టు సిరీస్‌లో 655 పరుగులు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు...

సరిగ్గా ఇదే 2020లో భారత జట్టు చెత్త రికార్డును క్రియేట్ చేసింది. ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం దక్కింది...

ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థికి ఆధిక్యం అప్పగించడం ఇదే తొలిసారి. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు మరో 150-200 పరుగులు చేసినా, మనదే విజయం అనుకున్నారంతా...

అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 36 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. భారత బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరూ కూడా సింగిల్ డిజిట్ స్కోరు దాటలేకపోయారు.

మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే అత్యధిక స్కోరు కాగా అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా, అశ్విన్ డకౌట్ అయ్యారు. మహ్మద్ షమీ రిటైర్ హర్ట్‌గా పెవిలియన్ చేరడంతో 36/9 వద్ద భారత ఇన్నింగ్స్‌కి తెరపడింది...

90 పరుగుల టార్గెట్‌తో బరిలో ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. భారత జట్టు ఆడిన చివరి డే నైట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో ఎదురైన పరాభవం కారణంగా ఇంగ్లాండ్ టూర్‌లో ఆడాల్సిన డే నైట్ టెస్టును రద్దు చేసుకుంది భారత జట్టు...
 

ఆడిలైడ్ ఘోర పరాజయం తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలవగా, ఈరోజున త్రిబుల్ సెంచరీ చేసిన కరణ్ నాయర్, ఆ తర్వాత మూడు మ్యాచులకే టీమ్‌కి దూరం కావడం విశేసం. 

click me!