
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, సీనియర్ బ్యాట్స్‌మన్ జో రూట్ టెస్టు క్రికెట్‌లో మరో ఘనత సాధించాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్టు నాలుగో రోజు కీలక ఇన్నింగ్స్ ను ఆడాడు. ఇదే క్రమంలో నంబర్ 4 స్థానంలో 8000 టెస్ట్ పరుగులు పూర్తి చేసి క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
జో రూట్ 8000కి పైగా టెస్ట్ పరుగులు నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ చేసి సాధించాడు. అతని కంటే ముందు ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల లిస్టులో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (13,492 పరుగులు), శ్రీలంక బ్యాట్స్‌మన్ మహేలా జయవర్ధనె (9,509 పరుగులు), దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్ కల్లిస్ (9,033 పరుగులు) లు ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలైట్ గ్రూప్ లో జోరూట్ చేరాడు.
నాలుగో స్థానంలో ఇప్పటి వరకూ జో రూట్ 99 మ్యాచ్‌లలో 170 ఇన్నింగ్స్‌ల్లో 8009 పరుగులు చేశారు. ఇందులో 25 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను 51.67 సగటుతో రాణించారు.
నంబర్ 4 స్థానంలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో జో రూట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ విషయంలో ఇప్పటికే భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (7,564 పరుగులు), వెస్టిండీస్ దిగ్గజం బ్రయాన్ లారా (7,535 పరుగులు) లను అధిగమించాడు.
ఈ టెస్టు సిరీస్‌లో రూట్ మరో అరుదైన ఘనత సాధించారు. తన కెరీర్‌లో 37వ టెస్ట్ సెంచరీని సాధించి భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ (36 సెంచరీలు) రికార్డును అధిగమించారు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్ ఇప్పుడు ఐదవ స్థానంలో ఉన్నాడు.
లార్డ్స్‌లో మొదటి ఇన్నింగ్స్ లో రూట్ సెంచరీ కొట్టాడు. మ్యాచ్ రెండో రోజు 192 బంతుల్లో పూర్తి చేశారు. మూడో రోజు 99 పరుగుల వద్ద నిలిచిన రూట్, నాలుగో రోజు తొలి బంతికే బౌండరీ కొట్టి సెంచరీని (104 పరుగులు) పూర్తి చేశారు.
అలాగే, రెండో ఇన్నింగ్స్ లో కూడా వరుస వికెట్లు పడుతున్న క్రమంలో 40 పరుగుల కీలక ఇన్నింగ్స్ ను ఆడాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో 40 పరుగుల వద్ద అవుట్ అయ్యారు.
ఫీల్డింగ్‌లోనూ కొత్త రికార్డు కొట్టిన జోరూట్
బ్యాటింగ్ మాత్రమే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా జోరూట్ ఈ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్-వికెట్ కీపర్‌గా రాహుల్ ద్రావిడ్ రికార్డును అధిగమించాడు.
బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో, మొదటి స్లిప్‌లో డైవింగ్ క్యాచ్‌తో రూట్ తన 210వ టెస్ట్ క్యాచ్‌ను అందుకున్నాడు. భారత ఆటగాడు కరుణ్ నాయర్ (40 పరుగులు) ఇచ్చిన క్యాచ్ ను పట్టుకోవడంతో జోరూట్ ఈ ఘటన సాధించాడు.
నంబర్ 4 స్థానంలో అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన ఆటగాడిగా భారత్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నారు. ఆయన 179 టెస్ట్‌ల్లో 13,492 పరుగులు చేశారు. ఈ ఘనతకు చేరిన ఏకైక ఆటగాడు సచిన్ మాత్రమే.
జో రూట్ ఇప్పటికీ ఆ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో సచిన్ రికార్డును జోరూట్ బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.