కాలం కలిసొచ్చినా.. వీసా వెక్కిరించింది..! పాపం ఉనద్కట్.. ఇంకా ఇండియాలోనే..

First Published Dec 14, 2022, 12:57 PM IST

BANvsIND 1st Test: రాక రాక వచ్చిన అవకాశం. పుష్కరకాలం తర్వాత  జాతీయ జట్టులో చోటు. తుది జట్టులో ఉంటాడా.. ఉండడా.. అన్న విషయం పక్కనబెడితే కనీసం  టీమ్ తో  కూడా చేరలేదు.  

వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ పన్నెండేండ్ల తర్వాత  భారత జట్టుకు తిరిగి ఎంపికైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ కు ముందు మహ్మద్ షమీ గాయపడటంతో  అతడి స్థానంలో సెలక్టర్లు ఉనద్కట్ ను సెలక్ట్ చేశారు. అయితే  12 ఏండ్ల తర్వాత అవకాశం రావడంతో  ఎగిరిగంతేశాడు ఉనద్కట్. 
 

జాతీయ జట్టులో చోటు దక్కకపోయినా  దేశవాళీలో రాణిస్తూ   ఐపీఎల్,  విజయ్ హజారే, రంజీ వంటి ట్రోఫీలలో  కాలం గడుపుతున్న ఉనద్కట్ కు బంగ్లాదేశ్ సిరీస్ లో అవకాశం రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కాలం కలిసొచ్చినా   అతడిని విధి మరోలా వెక్కిరించింది. ఇన్నాళ్లకు వచ్చిన అవకాశాన్ని వీసా సమస్యలు తన్నుకుపోయాయి. 

మూడు రోజుల క్రితమే షమీకి బదులు  ఉనద్కట్ పేరును సెలక్టర్లు కన్ఫర్మ్  చేశారు. అయితే ఆలస్యంగా పిలుపు రావడంతో ఉనద్కట్  బంగ్లాదేశ్ కు వెళ్లడానికి సిద్దమయ్యాడు. కానీ ఈ సౌరాష్ట్ర బౌలర్  వీసా సమస్యల కారణంగా ఇంకా గుజరాత్ లోనే ఉండిపోయాడు.  బీసీసీఐ లాజిస్టిక్ విభాగం అతడిని బంగ్లాదేశ్ కు పంపించడానికి అన్ని విధాలా యత్నించింది.  కానీ తొలి టెస్టు ప్రారంభానికల్లా అతడు  బంగ్లాకు చేరడం కష్టమే అని తేలింది. 

బంగ్లాదేశ్ తో  చట్టోగ్రమ్ వేదికగా  జరుగుతున్న  తొలి టెస్టు ఇప్పటికే ప్రారంభమైంది. వాస్తవానికి జయదేవ్  అనుకున్న సమయానికి  జట్టుతో కలిసినా అతడికి తుది జట్టులో చోటు దక్కడం గగనమే అయ్యేది. కానీ ఆ అవకాశం కూడా లేకుండా వీసా సమస్యలతో జయదేవ్ భారత్ లోనే ఆగిపోవాల్సి వచ్చింది.  

సోమవారం జయదేవ్ ను బంగ్లాకు పంపడానికి తీవ్రంగా కృషి చేసినా విఫలమైన బీసీసీఐ.. నేడైనా అక్కడికి పంపాలని యోచిస్తున్నది. మరి  ఇవాళ అయినా జయదేవ్  బంగ్లాకు చేరుతాడో లేదో అనుమానమే. తొలి టెస్టు ఎలాగూ మిస్ అయిన జయదేవ్ కు రెండో టెస్టులో అయినా టీమ్ మేనేజ్మెంట్ అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. 

కాగా 2010లో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించగా  సెంచూరియన్ వేదికగా అరంగేట్రం చేసిన జయదేవ్ ఆ  మ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో  సెలక్టర్లు అతడిని పెద్దగా పట్టించుకోలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా  దేశవాళీలో రాణించిన జయదేవ్  12 ఏండ్ల తర్వాత ఆడే అవకాశమొచ్చినా  విధి వీసా రూపంలో వెక్కిరించడం బాధాకరం. 

click me!