అండర్సన్ అరుదైన ఘనత.. పేస్ బౌలర్లలో ప్రపంచ రికార్డు

First Published Aug 28, 2022, 3:28 PM IST

England vs South Africa: ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్  మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. వయసుమీద పడుతున్నా దుమ్ము రేపుతున్న ఈ  సీనియర్ బౌలర్ తాజాగా మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. 

ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మరో రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ పేరిట ఉన్న రికార్డును చెరిపేసి  తాజాగా కొత్త రికార్డులు నెలకొల్పాడు. 

ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య  శనివారం ముగిసిన రెండో టెస్టులో ఆండర్సన్ ఆరు వికెట్లు (తొలి ఇన్నింగ్స్ లో 3, రెండో ఇన్నింగ్స్ లో 3) పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీయడం ద్వారా అతడు ప్రపంచ పేస్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అరుదైన ఘనతను అందుకున్నాడు. 

అండర్సన్ కు ఇది  తన అంతర్జాతీయ కెరీర్ లో 950వ వికెట్ కావడం గమనార్హం. ఈ జాబితాలో గ్లెన్ మెక్‌‌గ్రాత్ (949 వికెట్లు) రికార్డును బద్దలుకొట్టిన అండర్సన్.. నెంబర్ వన్ పీఠాన్ని అధిరోహించాడు. అండర్సన్.. 174 టెస్టులలో 664 వికెట్లు తీయగా.. 194 వన్డేలలో 269 వికెట్లు పడగొట్టాడు. 19 టీ20లలో 18 వికెట్లు తీశాడు. 

ఇక మొత్తంగా  అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసినవారి జాబితాలో అండర్సన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు అనిల్ కుంబ్లే (956 వికెట్లు), షేన్ వార్న్ (1001 వికెట్లు), ముత్తయ్య మురళీధరన్ (1,347 వికెట్లు) ఉన్నారు. మరికొద్దిరోజులు క్రికెట్ ఆడుతూ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే అండర్సన్.. షేన్ వార్న్ రికార్డును బద్దలుకొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. 
 

ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా రెండో టెస్టు విషయానికొస్తే.. ఈ మ్యాచ్ లో ఆథిత్య ఇంగ్లీష్ జట్టు ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.  సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్ లో 151 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తూ.. 9 వికెట్ల నష్టానికి 415 పరుగులు చేసింది.  రెండో ఇన్నింగ్స్ లో సఫారీలు.. 179 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ తొలి టెస్టులో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 
 

ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ లో (చెరో మ్యాచ్ గెలిచాయి) ఫలితం తేలకపోగా టీ20 సిరీస్ ను సఫారీలు చేజిక్కించుకున్నారు. ఇక తొలి టెస్టులో దక్షిణాఫ్రికా  గెలవగా.. రెండో టెస్టులో ఇంగ్లాండ్ నెగ్గింది. రెండు జట్ల మధ్య చివిరిదైన సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు  వచ్చే నెల 8 నుంచి జరగాల్సి ఉంది. 
 

click me!