ఆ ముగ్గురికి చెక్ పెట్టిన టీమిండియా వైస్ కెప్టెన్.. అదే జరిగితే వరల్డ్ కప్ ఆశలు గోవిందా..

First Published Dec 5, 2022, 12:17 PM IST

INDvsBAN: బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో భారత జట్టు  రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను  గాయం (?) పేరుతో  పక్కనబెట్టి టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు గ్లవ్స్ అందజేసింది.  

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వల్ల కాని  ఐసీసీ ట్రోఫీ కలను  రోహిత్ శర్మ  తీర్చుతాడని  ఆశలు పెట్టుకున్న  బీసీసీఐ..  ఏడాది క్రితం ఆ బాధ్యతలను  హిట్ మ్యాన్ కు అప్పజెప్పింది. అయితే  ఇటీవలే ముగిసిన  టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో  భారత జట్టు సెమీస్ గండాన్ని దాటలేక చతికిలపడింది. దీంతో ఇప్పుడు టీమిండియా ఆశలన్నీ  వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే  వన్డే ప్రపంచకప్ మీదే ఉన్నాయి. 

ఈ మెగా టోర్నీ భారత్ లో జరుగుతుండటంతో  దీనిని  ఒడిసిపట్టుకోవాలని  బీసీసీఐ తో పాటు టీమిండియా కూడా  ఆ మేరకు ప్రణాళికలు రచిస్తున్నది. తాజాగా బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో  భారత జట్టు మేనేజ్మెంట్  చేసిన పని కూడా  ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. బంగ్లాతో వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో భారత జట్టు రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను కాదని  టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు ఆ బాధ్యతలను అప్పజెప్పింది.   చాలాకాలం తర్వాత రాహుల్.. జాతీయ జట్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలు మోశాడు.  ఇది ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని అమలుచేస్తున్న ప్రణాళికల్లో భాగమేనని టీమ్ మేనేజ్మెంట్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. 
 

పరిమిత ఓవర్ల క్రికెట్ లో రిషభ్ పంత్  కు ఘనమైన రికార్డులేమీ లేవు. అదీగాక గడిచిన ఏడాదిన్నర కాలంగా పంత్  వైట్ బాల్ క్రికెట్ లో అత్యంత దారుణంగా విఫలమవుతున్నాడు.  బీసీసీఐ పెద్దల అండదండలతో నెగ్గుకొస్తున్నాడు తప్ప  పంత్ ఆట  నానాటికీ తీసికట్టుగా మారుతున్నది.   పంత్ స్థానంలో  సంజూ శాంసన్ ను ఆడించాలని విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. 

పంత్ సంగతి పక్కనబెడితే టీమిండియాలో ఇప్పటికిప్పుడు  మరో ఇద్దరు వికెట్ కీపర్లు కూడా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. వారిలో సంజూ శాంసన్ తో  పాటు ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు.  ఈ ఇద్దరూ   వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల సమర్థులు. జట్టులో ఏ స్థానంలో బ్యాటింగ్ కు పంపినా ఆడగలిగేవాళ్లే. 

సంజూ శాంసన్ తప్ప   రిషభ్ పంత్,  ఇషాన్ కిషన్ లు బంగ్లాదేశ్ టూర్ లో ఉన్నారు. పంత్ కు గాయమని   సిరీస్ నుంచి తప్పించినా  ఇషాన్ కు గ్లవ్స్ ఇవ్వకుండా  రాహుల్  కే ఆ బాధ్యతలు అప్పగించడంతో  భారత జట్టు వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకునే  ఇలా  చేసిందనే వాదనలూ వినిపిస్తున్నాయి.  ఒకవేళ  రాహుల్ ను కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం పంత్, శాంసన్, ఇషాన్  లు వరల్డ్ కప్ మీద ఆశలు వదులుకోవాల్సిందే.

మ్యాచ్ అనంతరం  రాహుల్ కామెంట్స్ చూస్తే ఇది నిజమనిపించక మానదు. రాహుల్ మాట్లాడుతూ.. ‘గడిచిన ఆరేడు నెలలుగా మేం వన్డేలు పెద్దగా ఆడలేదు. ఈ మ్యాచ్ కు ముందు   నేను ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి  వికెట్ కీపింగ్ చేయలని టీమ్ మేనేజ్మెంట్ నాతో చెప్పింది.  పంత్ ను  ఎందుకు సిరీస్ నుంచి తప్పించారనే విషయం నాకు తెలియదు..’ అని  అన్నాడు.

వన్డేలలో  రాహుల్ ను వికెట్ కీపర్ గా కొనసాగిస్తే అతడిని ఐదో స్థానంలో ఆడించేందుకే టీమ్ మేనేజ్మెంట్  జట్టు కూర్పును చేయవచ్చు. ఓపెనర్లుగా  రోహిత్, ధావన్  లు ఉండనే ఉన్నారు. వీరిలో ఎవరికైనా గాయమైతేనో లేక విశ్రాంతినిస్తేనో తప్ప  ఓపెనర్లుగా వీరిని మార్చే వీళ్లేదు.  తర్వాత కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ లు బ్యాటింగ్ కు వస్తారు.

టీ20లలో రాణిస్తున్న సూర్య వన్డే వరల్డ్ కప్ లో కూడా మెరుస్తాడని భావిస్తున్న  టీమ్ మేనేజ్మెంట్ అతడిని కూడా  జట్టులో స్థానం సుస్థిరం చేసి బ్యాటింగ్ ఆర్డర్ ను పటిష్టం  చేసేందుకు  ప్రయత్నాలు చేస్తున్నది.  ఒకవేళ అదే జరిగితే మాత్రం   రాహుల్  వికెట్ కీపర్ గా ఉండాల్సిందే.  పంత్, శాంసన్, ఇషాన్ లు (వన్డేలకు) రాహుల్ గాయపడితేనో లేక విశ్రాంతినిస్తేనో తప్ప  తప్పనిసరిగా జట్టులోకి వచ్చే ఛాన్స్ ను కోల్పోయినట్టే..

click me!