IPL2021 RCB vs KKR: అరుదైన ఘనతకు చేరువలో హర్షల్ పటేల్.. నేటి మ్యాచ్ లో దానిని సాధిస్తే బ్రావో రికార్డుకు బీటలు

First Published Oct 11, 2021, 2:59 PM IST

Harshal Patel: రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. నేడు కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుతున్న బెంగళూరులో కీ బౌలర్ గా ఉన్న హర్షల్.. మరో 2 వికెట్లు తీస్తే ఆ ఘనత అతడి సొంతమవుతుంది. 

అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఉండి ఈ సీజన్ లో ఆర్సీబీ తరఫున బౌలింగ్ లో అదరగొడుతున్న హర్షల్ పటేల్ మరో అరుదైన ఘనతకు అతి చేరువలో ఉన్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగే మ్యాచ్ లో గనక హర్షల్ పటేల్ మరో రెండు వికెట్లు తీస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో రికార్డును అతడు బద్దలు కొడతాడు. 

ఒక్క ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు బ్రావో పేరిట ఉంది. 2013 ఐపీఎల్ సీజన్ లో బ్రావో.. సీఎస్కే తరఫున 32 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. 

ఇక ఈ సీజన్ లో పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన  హర్షల్ ఇప్పటికే 30 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు. బ్రావో రికార్డును అధిగమించాలంటే హర్షల్ మరో రెండు వికెట్లు తీస్తే చాలు. హర్షల్ ప్రస్తుత ఫామ్ చూస్తే  రెండు వికెట్లు తీయడం పెద్ద విషయమేమీ కాదు. 

ఇప్పటికే హర్షల్.. ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో అంతకుముందు జస్ప్రీత్ బుమ్రా (27 వికెట్లు), భువనేశ్వర్ (26 వికెట్లు) రికార్డులను చెరిపేశాడు. 

ఈ సీజన్ కు ముందు అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఉన్న హర్షల్.. ప్రస్తుత ఐపీఎల్ లో ఆర్సీబీ బౌలింగ్ కు పెద్దదిక్కయ్యాడు. గుజరాత్ కు చెందిన అతడు.. దేశవాళీలో మాత్రం హర్యానా తరఫున ఆడుతున్నాడు. 

ఇక పటేల్ తర్వాత స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అవేశ్ ఖాన్ (23 వికెట్లు) పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నా.. అతడికి పటేల్ రికార్డు బ్రేక్ చేసే అవకాశం లేదు. ఇప్పటికే తొలి క్వాలిఫైయర్ లో ఢిల్లీ ఓడిపోగా.. ఫైనల్స్ కు చేరడానికి దానికి మరో అవకాశం మాత్రమే ఉంది. ఒకవేళ రెండు మ్యాచ్ లు గెలిస్తే మాత్రం అవేశ్ కు ఛాన్స్ దక్కుతుంది. 

ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా నేటి సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్కతా నైట్ రైడర్స్ ను ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్ లో  గెలిచిన జట్టే  ఫైనల్స్ పోరులో తలబడటానికి అవకాశం ఉంటుంది. 

ఆర్సీబీ తరఫున కెప్టెన్సీకి ఈ సీజన్ తర్వాత గుడ్ బై చెప్పనున్న కోహ్లి.. ఈ సారి బెంగళూరుకు కప్ అందించి  సారథిగా వైదొలగాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే బెంగళూరు ప్రదర్శన కూడా ఉంది. మరి నేటి కీలక పోరులో కోహ్లి.. తొలి ఐపీఎల్ కప్పు దిశగా అడుగేస్తాడో లేదో కొద్దిగంటల్లో తేలిపోతుంది.

click me!