IPL2021 Final: సరైన టైమ్‌లో, కరెక్ట్ దిశలో వెళ్తున్నారు, ఈసారి టైటిల్ వాళ్లదే... డేల్ స్టెయిన్ కామెంట్స్...

First Published Oct 14, 2021, 5:30 PM IST

చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా కరోనా కారణంగా రెండు ఫేజ్‌లుగా జరిగిన IPL2021 సీజన్‌లో ఫైనల్ మ్యాచ్‌తో శుభం కార్డు పడనుంది. గత సీజన్‌లో దారుణమైన పర్ఫామెన్స్‌తో ఏడో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి అద్భుత విజయాలతో ఫైనల్‌కి దూసుకురాగా... కేకేఆర్ కథ మరోలా సాగింది. 

ఫస్టాఫ్‌లో రెండంటే రెండే విజయాలు అందుకున్న కోల్‌కత్తా, సెకండాఫ్‌లో అద్వితీయ విజయాలతో ప్లేఆఫ్స్‌కి చేరుకుని, ఎలిమినేటర్, రెండో క్వాలిఫైయర్ మ్యాచుల్లో విజయాలు అందుకుని... ఫైనల్‌కి దూసుకొచ్చింది...

అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా ఫైనల్ చేరిన టూ టైం ఛాంపియన్ కేకేఆర్, ఆఖరి ఫైట్‌లో మూడుసార్లు టైటిల్ గెలిచిన సీఎస్‌కేతో తలబడనుంది. ఈ ఇరు జట్లూ ఫైనల్‌లో తలబడడం ఇది రెండోసారి...

ఇంతకుముందు 2012లో కేకేఆర్, సీఎస్‌కే మధ్య జరిగిన ఫైనల్‌లో నైట్‌రైడర్స్... 190 పరుగుల టార్గెట్‌ను ఆఖరి ఓవర్‌లో ఛేదించి, మొట్టమొదటి టైటిల్ కైవసం చేసుకుంది...

చెన్నై సూపర్ కింగ్స్‌ ఐపీఎల్ చరిత్రలో ఇంతకుముందు 8 సార్లు ఫైనల్ చేరి, మూడు సార్లు టైటిల్ సాధిస్తే, ఫైనల్ చేరిన రెండు సార్లూ టైటిల్ గెలిచి రికార్డు క్రియేట్ చేసింది కేకేఆర్... దీంతో ఇరు జట్ల మధ్య ఫైనల్ ఫైట్ ఆసక్తికరంగా సాగనుంది...

‘నా దృష్టిలో క్రికెట్‌లో లక్ కూడా చాలా అవసరం. అది కసినో లాంటిది. పదిసార్లు బ్లాక్‌ మీద పడిన బాల్, పదకొండోసారి దాని మీదే పడుతుందనుకుంటే రెడ్ మీద పడొచ్చు... కేకేఆర్‌కి కూడా అలాంటి లక్కే కలిసి వచ్చి, ఫైనల్‌కి వచ్చారు...

కెప్టెన్సీలో మోర్గాన్ తీసుకున్న కొన్ని చెత్త నిర్ణయాలు, మోర్గాన్‌తో పాటు దినేశ్ కార్తీక్ పేలవ ఫామ్ వంటి ఎన్నో సమస్యలు కేకేఆర్‌లో ఉన్నాయి, అయినా అదృష్టం తోడు కావడంతో ఆ లోపాలన్నీ కప్పుకుపోయాయి...

ఢిల్లీతో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లోనూ అంతే, చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు... రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్టబట్టి, ఫైనల్ చేరారు. ఫైనల‌్‌లో సీఎస‌కేకి గట్టి పోటీ ఇవ్వాలంటే ఈ తప్పులన్నింటినీ సరిచేసుకుని ఆడాల్సి ఉంటుంది...

ఎందుకంటే ఈసారి సీఎస్‌కే అద్భుతంగా ఆడుతోంది. చాలా కూల్‌గా, కామ్‌గా ఫైనల్ దాకా వచ్చేసింది. వాళ్లు సరైన సమయంలో సరైన మార్గంలో వెళ్తున్నారు.. ధోనీ కూడా ఫామ్‌లోకి వచ్చేశాడు..

అతను ఫామ్‌లో లేకున్నా, కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అవుతూనే ఉన్నాడు. వాళ్ల బ్యాట్స్‌మెన్ అందరూ అదరగొడుతున్నారు. కేకేఆర్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్న సీఎస్‌కే నా ఉద్దేశంలో టైటిల్ ఫెవరెట్...

ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి పోటీ ఇవ్వాలంటే మాత్రం కోల్‌కత్తా నైట్‌రైడర్స్, తమకున్న అన్ని అస్త్రాలతో బరిలో దిగి, అందరూ కలిసి కట్టుగా ఆడాల్సి ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్...

ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఇప్పటిదాకా ఒక లెక్క, ఫైనల్ మ్యాచ్ మరో లెక్క.. కేకేఆర్ గతంలో రెండుసార్లు టైటిల్ గెలిచినప్పుడు జట్టులో కీ ప్లేయర్‌గా ఉన్న రాబిన్ ఊతప్ప, ఈసారి సీఎస్‌కే తరుపున ఆడుతుండడం కొసమెరుపు...

click me!