IPL 2021 విజేత చెన్నై సూపర్ కింగ్స్... ధోనీ జట్టు ఖాతాలో నాలుగో టైటిల్... ఫైనల్‌లో కేకేఆర్ చిత్తు...

First Published Oct 15, 2021, 11:27 PM IST

ఐపీఎల్ 2021 ఫైనల్‌లో కేకేఆర్‌ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజతగా నిలిచింది. ఇప్పటికే మూడు టైటిల్స్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌‌కి ఇది నాలుగో టైటిల్. ఐదు టైటిల్స్‌తో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌కి మరింత చేరువైంది సీఎస్‌కే... 193 పరుగుల లక్ష్యఛేదనలో ఒకానొక దశలో 92/0 పరుగులతో ఉన్న కేకేఆర్, వరుస వికెట్లు కోల్పోయి... చిత్తుగా ఓడింది... 

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌లో 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. హజల్‌వుడ్ వేసిన రెండో ఓవర్ రెండో బాల్‌కి షాట్ ఆడబోయిన వెంకటేశ్ అయ్యర్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ బంతి, వికెట్ కీపర్ ధోనీ చేతుల్లోకి వెళ్లింది...

క్యాచ్ పట్టినట్టే పట్టిన ఎమ్మెస్ ధోనీ, ఆఖరి సెకన్లలో దాన్ని జారవిడిచాడు. దీంతో డకౌట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న వెంకటేశ్ అయ్యర్, ఆ తర్వాతి బంతి నుంచి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. 

అలాగే జడేజా వేసిన 10వ ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన శుబ్‌మన్ గిల్, అంబటి రాయుడు పట్టిన అద్భుత క్యాచ్‌కి అవుట్ అయ్యాడు... 

అయితే టీవీ రిప్లైలో గిల్ కొట్టిన షాట్, కెమెరా కేబుల్‌కి తగిలి దిశ మార్చుకున్నట్టుగా కనిపించింది. దీంతో ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించిన అంపైర్లు, గిల్‌ను నాటౌట్‌గా తేల్చారు... అదే ఓవర్‌లో రెండు ఫోర్లు బాది, అప్పటిదాకా నెమ్మదిగా ఆడుతూ వచ్చిన గిల్, గేర్ మార్చినట్టు కనిపించాడు...

32 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయ్యర్ అవుటయ్యే సమయానికి 10.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది కేకేఆర్... అయితే అయ్యర్ అవుటైన తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ పెవిలియన్‌కి క్యూ కట్టారు... 

43 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ను దీపక్ చాహార్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయగా... వన్‌డౌన్‌లో వచ్చిన  నితీశ్ రాణా డకౌట్ కాగా, సునీల్ నరైన్ 2 పరుగులు, మోర్గాన్ 4, దినేశ్ కార్తీక్ 9, షకీబుల్ హసన్ డకౌట్, రాహుల్ త్రిపాఠి 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు...

ఓటమి ఖారారైన తర్వాత శివమ్ మావి, లూకీ ఫర్గూసన్ మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పిన శార్దూల్ ఠాకూర్, మూడు వికెట్లు తీయగా హజల్‌వుడ్, జడేజా రెండేసి వికెట్లు తీశారు.

సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోగా, ఈ సీజన్‌లో 32 వికెట్లు తీసిన ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ గెలిచాడు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ప్లేఆఫ్ నుంచి దూరమైన మొదటి జట్టుగా నిలిచి, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్... ఈ సీజన్‌లో టైటిల్‌తో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది...

click me!