IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

First Published Oct 15, 2021, 9:30 PM IST

నిజజీవితంలో అయినా, క్రికెట్‌లో అయినా Ex చాలా చాలా స్పెషల్. తనని వదిలేసిన, తాను వదిలేసిన టీమ్‌కు తానేంటో చూపించాలనే కసి, తాపత్రయం ప్రతీ ప్లేయర్‌కీ ఉంటుంది. కేకేఆర్ మాజీ ప్లేయర్ రాబిన్ ఊతప్పకి ఆ అవకాశం ఫైనల్‌ రూపంలో దక్కింది...

ఐపీఎల్ 2021 సీజన్‌ వేలంలో రాబిన్ ఊతప్పని రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. 35 ఏళ్ల వయసులో మునుపటి మెరుపులు చూపించలేకపోతున్న రాబిన్ ఊతప్పని అంత పోసి పెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

ఇండియాలో జరిగిన ఫస్టాఫ్‌లో సురేష్ రైనా, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు రాణించడంతో రాబిన్ ఊతప్పకి పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే యూఏఈలో జరుగుతున్న సెకండాఫ్‌లో రైనా, మొయిన్ ఆలీ ఫెయిల్ కావడంతో ఊతప్పకి అవకాశం వచ్చింది...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో 44 బంతుల్లో 63 పరుగులు చేసి అదరగొట్టిన రాబిన్ ఊతప్ప, ఫైనల్ మ్యాచ్‌లో 15 బంతుల్లో 3 భారీ సిక్సర్లతో 31 పరుగులు చేసి దుమ్మురేపాడు...

ఫైనల్ మ్యాచ్‌లో 206.66 స్ట్రైయిక్ రేటుతో 30+ పరుగులు చేసిన ప్లేయర్‌గా 2016లో సన్‌రైజర్స్ ప్లేయర్ బెన్ కట్టింగ్, 2014లో పంజాబ్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా తర్వాతి స్థానంలో నిలిచాడు రాబిన్ ఊతప్ప... 

ఐపీఎల్‌ కెరీర్‌లో ఆరు జట్లకి ఆడినప్పటికీ రాబిన్ ఊతప్పకి సరైన గుర్తింపు వచ్చింది మాత్రం కేకేఆర్ జట్టులోనే... 2014 సీజన్‌లో 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన రాబిన్ ఊతప్ప, ఈసారి ఆ జట్టుపైనే దూకుడు చూపించి తానేం చేయగలడో మరోసారి చూపించాడు...

గైక్వాడ్ అవుటైన తర్వాత మరో వికెట్ పడి ఉంటే, కేకేఆర్‌కి చెన్నై బ్యాట్స్‌మెన్‌ని తక్కువ స్కోరుకి పరిమితం చేసే అవకాశం దక్కేది. అయితే ఉన్నది తక్కువ సమయం అయినా, తనదైన ముద్ర వేసి వెళ్లాడు రాబిన్ ఊతప్ప...

ముఖ్యంగా సీజన్‌లో ఇప్పటివరకూ 7 కంటే తక్కువ ఎకానమీ బౌలింగ్ చేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ బౌలింగ్‌లో కూడా సిక్సర్లు బాది, వారిని ఎలా ఆడాలో మిగిలిన బ్యాట్స్‌మెన్‌కి చూపించాడు...

ఊతప్ప కొట్టిన సిక్సర్లతో తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా తేలిగ్గా బౌండరీలు బాదడం మొదలెట్టారు. ఫలితంగా టాస్ గెలిచి మరీ ప్రత్యర్థికి బ్యాటింగ్‌కి అప్పగించిన కేకేఆర్ ముందు భారీ టార్గెట్‌ నిలిచింది...

2014లో కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు ఆ జట్టు తరుపున ఆడినవారిలో సునీల్ నరైన్, షకీబుల్ హసన్ మాత్రమే ఇప్పటికీ అందులో ఉన్నారు. అప్పుడు కేకేఆర్ తరుపున ఆడిన రాబిన్ ఊతప్ప మాత్రం ప్రత్యర్థిజట్టు తరుపున ఆడుతుండడం విశేషం...

click me!