IPL2021 CSK vs KKR: దినేశ్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి మెరుపులు... సీఎస్‌కే ముందు భారీ టార్గెట్...

First Published Sep 26, 2021, 5:29 PM IST

ఐపీఎల్ 2021: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది... మొదటి ఓవర్ నుంచి హై డ్రామా మధ్య నడిచిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట్స్‌మెన్, సీఎస్‌కే బౌలర్లపై పైచేయి సాధించగలిగారు...

మొదటి ఓవర్‌లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసి జోరుమీదున్న శుబ్‌మన్ గిల్, లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. అంబటి రాయుడు వేసిన డైరెక్ట్ త్రోకి గిల్ నిరాశగా పెవిలియన్ చేరాడు... 

అంతకుముందు బంతికే శుబ్‌మన్ గిల్ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్టు అంపైర్ ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన కేకేఆర్ ఓపెనర్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది... అయితే ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు గిల్... 

ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి కలిసి రెండో వికెట్‌కి 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 15 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

వెంకటేశ్ అయ్యర్ వికెట్ తీసిన శార్దూల్ ఠాకూర్, ఆ ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వకుండా వికెట్ మెడియిన్ ఓవర్‌గా ముగించాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది కేకేఆర్...

ఆ తర్వాత 14 బంతుల్లో 8 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్, హజల్‌వుడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. మోర్గాన్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర క్యాచ్‌గా మలిచాడు డుప్లిసిస్...

33 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి... రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు...

ఆ తర్వాత 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ కాగా... దినేశ్ కార్తీక్ వస్తూనే క్రీజులో మెరుపులు మెరిపించాడు...

11 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్, 20వ ఓవర్ నాలుగో బంతికి అవుట్ అయ్యాడు... 

27 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసిన నితీశ్ రాణా నాటౌట్‌గా నిలిచాడు.. సీఎస్‌కే బౌలర్లలో జోష్ హజల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీశారు...

click me!