MS Dhoni: టీ20 వరల్డ్ కప్ కు మెంటార్ గా ధోని నియామకం అందుకేనా..? నయా క్రికెట్ స్ట్రాటజిస్టు వ్యూహాలేమిటి..?

First Published Sep 26, 2021, 5:09 PM IST

T20 world cup: మహేంద్ర సింగ్ ధోని.. భారత క్రికెట్ కు పరిచయం అక్కర్లేని పేరు. ఆన్ ఫీల్డ్ లోనే గాక ఆఫ్ ది ఫీల్డ్ లోనూ కూల్ గా ఉండే ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా ఇటీవలే అతడు భారత టీ20 జట్టుకు మెంటార్ గా నియమితుడయ్యాడు. అయితే కోచ్ గా రవిశాస్త్రి ఉన్నా జట్టుకు ప్రత్యేకంగా సలహాదారులు ఎందుకని  ధోని నియామకంపై అనుమానాలు, ప్రశ్నలు కూడా తలెత్తాయి.

ఇండియన్ క్రికెట్ టీమ్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ధోనికి పేరుంది. టీ 20 వరల్డ్ కప్ తో పాటు వన్డే ప్రపంచ కప్, టెస్టు సిరీస్ ఛాంపియన్ షిప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా  అతడి సారథ్యంలోనే భారత్ సాధించింది. 

మిస్టర్ కూల్ గా జట్టు సహచరుల మన్ననలు అందుకున్న ధోని.. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు నాయకుడిగా ఉన్నా అది ముగిసిన వెంటనే ప్రారంభం కాబోయే టీ 20 ప్రపంచకప్ కు భారత జట్టుకు సలహాదారుడిగా నియమితుడయ్యాడు. 

ధోని నియామకం సరైందే అని కొందరు, అవసరం లేదని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే స్వదేశంతో పాటు విదేశాల్లోనూ వన్డేలు, టెస్టు సిరీస్ లను నెగ్గుతున్న విరాట్.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్న నేపథ్యంలో ధోని నియామకం భారత్ కు కలిసొస్తుందా..? లేదా..? అనేదానిపై క్రీడా పండితులు విశ్లేషణలు చేస్తున్నారు. 
 

ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్ లను గెలిపించడంలో ధోనిది అందెవేసిన చేయి.  అసలు ఆశలే లేని చోటు నుంచి శాసించే స్థితికి చేరేలా చేయగల సమర్థుడు  అతడు. ధోని సారథ్యంలో ఇట్లాంటి మ్యాచ్ లు కోకొల్లలు. కొండంత లక్ష్యం కనిపిస్తున్నా లోయరార్డర్ సాయంతో ఛేదించడం.. తక్కువ స్కోరు చేసినా వాటిని కాపాడుకోవడం.. అటాకింగ్ ఫీల్డింగ్ తో ప్రత్యర్థిని ఒత్తిడికి నెట్టడంలో ధోని ఓ నయా క్రికెట్ స్ట్రాటజిస్టు అనడంలో సందేహమే లేదు. 

ధోని వ్యూహాలకు బలికాని ఆటగాళ్లు, జట్లు లేవంటే అతిశయోక్తి కాదు. తాజాగా దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ రెండో ఫేజ్ లో సైతం ధోని మేనియా విస్పష్టంగా కనిపిస్తున్నది. 

రెండో ఫేజ్ మొదటి మ్యాచ్ లోనే పటిష్ట ముంబైతో తలపడిన చెన్నై.. 156 పరుగులే చేసింది. భీకర హిట్టర్లున్న ముంబై కి అదేం పెద్ద లక్ష్యమేమీ కాదు. కానీ ధోని మాత్రం వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. అటాకింగ్ ఫీల్డింగ్ తో ముంబైని తన వ్యూహాల వలలో బంధించి తక్కువ లక్ష్యాన్ని కూడా కాపాడుకున్నాడు. 20 పరుగులు తేడాతో ఆ మ్యాచ్ లో సీఎస్కే గెలుపొందింది. 

ఇదిలాఉంటే కోహ్లి మాత్రం లో స్కోరింగ్ మ్యాచ్ లలో చేతులెత్తేస్తున్నాడు.  రెండో దశలో గతవారం కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగులకే చాప చుట్టేసింది.  తర్వాత బౌలింగ్ చేసిన ఆర్సీబీ.. పది ఓవర్లోనే కేకేఆర్ కు విజయాన్ని బంగారు పళ్లెంలో అందించింది. 

ఇక శుక్రవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్ లో సైతం ఆర్సీబీ.. ఓ మోస్తారు లక్ష్యాన్ని (156) చెన్నై ముందుంచింది. కానీ దాన్ని కూడా కాపాడుకునేందుకు కోహ్లి పెద్దగా చేసిందేమీ లేదని మ్యాచ్ చూసినవాళ్లకు అవగతమవుతుంది. 71 పరుగులకే జోరుమీదున్న ఓపెనర్లు గైక్వాడ్, డు ప్లెసిస్ అవుటైనా ప్రత్యర్థి మీద ఒత్తిడి పెంచడంలో కోహ్లి విఫలమయ్యాడు. ఆ సమయంలో మరో వికెట్ పడితే పరిస్థితి వేరే విధంగా ఉండేది. 

ఈ ఉదంతాలే గాక ఛేదనలో కోహ్లి ఔట్ అయితే ఇక తర్వాత వచ్చే వాళ్లంతా అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. కోచ్ గా శాస్త్రి ఉన్నా  ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడంలో అతడు పెద్దగా సాధించిందేమీ లేదు. కానీ ధోని అలా కాదు.  లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సాయంతో కూడా మ్యాచులను గెలిపించగలడు. తక్కువ లక్ష్యం ఉన్నా  తనకున్న వనరులతో వాటిని కాపాడుకోగల సమర్థుడు. 

అంతేగాక టీ20 ఫార్మాట్ అంటేనే నిర్ణయాలు వేగంగా తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయాలను అంతే కచ్చితత్వంతో అమలు చేయాలి. అలా చూసుకున్నా ఆ విషయంలో ధోనికి ఎదురే లేదు. చేయి కంటే ముందు బుర్ర పని చేసే విధంగా వ్యూహాలు రచించి వాటిని అమలుచేయగల ధోని అండగా ఉంటే కోహ్లి పని మరింత సులువవుతుందనేది బీసీసీఐ పెద్దల నమ్మకం. అందుకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని కొద్దికాలమే అయినా ధోనిని  తిరిగి ఆన్ ఫీల్డ్ కు రప్పించింది. 

kohli dhoni

ఒక్క ఐపీఎల్ లోనే గాక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులలో సైతం ధోని కెప్టెన్సీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.  అందుకే ధోని అనుభవం కచ్చితంగా టీమ్ ఇండియాకు లాభిస్తుందని, అతడి వ్యూహాలకు విరాట్ దూకుడు తోడైతే కథ వేరే విధంగా ఉంటుందని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
 

click me!