Priyansh Arya
IPL 2025 Who is Priyansh Arya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో ఢిల్లీ యంగ్ బ్యాటర్ ప్రియాంష్ ఆర్య పంజాబ్ కింగ్స్ తరఫున తన విధ్వంసక బ్యాటింగ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ లో తన తొలి మ్యాచ్ లోనే ఫోర్లు, సిక్సర్లు బాదుతూ అద్బుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. ఐపీఎల్ 2025 5వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌తోనే ప్రియాంష్ ఆర్య ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
క్రీజులోకి వచ్చిన వెంటనే గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ను దంచికొట్టడం మొదలుపెట్టాడు. 23 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రషీద్ ఖాన్ చేతిలో అవుట్ అయినప్పటికీ, అతని దూకుడు విధానం అందరినీ ఆకట్టుకుంది. అతని పవర్ హిట్టింగ్ ను ఐపీఎల్ లో కూడా చూపించాడు.
Priyansh Arya,
దేశవాళీ క్రికెట్ లో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డులు సాధించిన ప్రియాంష్ ఆర్య కోసం ఐపీఎల్ 2025 మెగా వేలంలో బిడ్డింగ్ వార్ జరిగింది. చివరికి పంజాబ్ కింగ్స్ 3.8 కోట్లకు దక్కింకుకుంది. అతని బేస్ ప్రైస్ INR 30 లక్షలుగా ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.
ప్రియాంష్ ఆర్య మొదట ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం సృష్టించాడు. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ తరపున ఒకే ఓవర్‌లో ఆరు వరుసగా సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. కేవలం 50 బంతుల్లో 10 సిక్సర్లు, 10 ఫోర్లతో 20 పరుగుల ఇన్నింగ్స్ తో అతని జట్టుకు 308/5 భారీ స్కోరును అందించాడు. ఈ లీగ్‌లో 10 మ్యాచ్‌లలో 600లకు పైగా పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్ లో అత్యంత భయంకరమైన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.
ఐపీఎల్ అరంగేట్రానికి ముందు 2023-24 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాంష్ ఆర్య ఢిల్లీ తరపున ఏడు ఇన్నింగ్స్‌లలో 31.71 సగటు, 166.91 స్ట్రైక్ రేట్‌తో 222 పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్‌లో తమిళనాడుపై 47 బంతుల్లో 81 పరుగులు అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు.
2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆర్య ఫామ్ కొనసాగించాడు. కేవలం 43 బంతుల్లోనే 102 పరుగులతో సెంచరీ కొట్టాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 40.6 సగటు, 176.6 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 325 పరుగులు చేశాడు.
ప్రియాంష్ ఆర్య ఐపీఎల్ అరంగేట్రం అదరిపోయింది !
పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆర్యకు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం లభించింది. ప్రారంభం నుంచే ఫియర్ లెస్ బ్యాటింగ్ తో పంజాబ్ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. దీంతో పంజాబ్ టీమ్ 20 ఓవర్లలో 243/5 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది, చివరికి పంజాబ్ 11 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
T20 క్రికెట్‌లో రైజింగ్ స్టార్ ప్రియాంష్ ఆర్య
ప్రియాంష్ ఆర్య ఐపీఎల్ ప్రయాణంలో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఐపీఎల్ ఎంట్రీకి ముందు టీ20 రికార్డులు గమనిస్తే.. 18 మ్యాచ్‌ల్లో 30 కంటే ఎక్కువ సగటుతో 570 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 166.56 గా ఉంది. ఐపీఎల్ లో తన తొలి మ్యాచ్ లో 47 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. ఐపీఎల్ లో అతని నుంచి మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. పంజాబ్ కింగ్స్ కు కీలకమైన ప్లేయర్ గా ఈ సీజన్ లో అతని నుంచి గొప్ప ఇన్నింగ్స్ లు చూస్తామని కెప్టెన్ అయ్యర్ కూడా చెప్పడం అతని నిర్భయ బ్యాటింగ్ విధానం ఎలాంటిదో స్పష్టం చేస్తోంది.