KL Rhaul: చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమిని ఎదుర్కొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 24వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో రాయల్ ఛాలెజంర్స్ బెంగళూరు తలపడింది. బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొడుతూ ఆర్సీబీని డీసీ 6 వికెట్ల తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. 164 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్. ఆరంభంలో వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ అద్బుతమైన నాక్ తో చివరివరకు క్రీజులో ఉండి ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాన్ని అందించాడు.
తన సొంత గ్రౌండ్ లో కేఎల్ రాహుల్ కు ఎలా ఆడాలో తెలుసు. చాలా సంవత్సరాలుగా ఇదే గ్రౌండ్ లో క్రికెట్ ఆడాడు. ఆ సౌకర్యాలను ఉపయోగించుకుని కీలకసమయంలో క్రీజులో నిలబడి విన్నింగ్ నాక్ ఆడాడు. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 93 అజేయ ఇన్నింగ్స్ తో ఢిల్లీని గెలిపించాడు. ఆర్సీబీని హోం గ్రౌండ్ లో ఓడించాడు.
మొత్తంగా ఆర్సీబీపై తన అధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఆర్సీబీ అంటే చాలు అద్భుత ఇన్నింగ్స్ లు ఆడే కేఎల్ రాహుల్.. 16 ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 741 పరుగులు చేశాడు.
మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్‌లో కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత.. గ్రౌండ్ ను ఎలా ఉపయోగించుకున్నాడో, ఎలా ఈ సూపర్ నాక్ ఆడాడో వివరించాడు. ఆ రోజు అది కొంచెం గమ్మత్తైన వికెట్ అనీ, డీసీ బౌలింగ్ చేస్తున్నప్పుడు స్టంప్స్ వెనుక ఉండటం వల్ల ట్రాక్ గురించి మరింత తెలుసుకోవడానికి తనకు సహాయపడిందని చెప్పాడు. అక్కడి నుంచే పరిస్థితులను అంచనా వేయడంతో మంచి ఫలితం లభించిందని చెప్పాడు.
Image Credit: TwitterDelhi Capitals
టార్గెట్ ఛేదనలో బాల్ ను ఎక్కడ కొట్టి పరుగులు రాబట్టాలో తనకు తెలుసునని కేఎల్ రాహుల్ తెలిపాడు. అలాగే, తాను ఇచ్చిన క్యాచ్ ను రజత్ పాటిదార్ వదలడంతో మరో లైఫ్ పొందడం తన తన అదృష్టమని కూడా చెప్పాడు. బెంగళూరు లోకల్ బాయ్ అయిన కేఎల్ రాహుల్.. చిన్నస్వామి స్టేడియం గురించి అందరికంటే తనకు బాగా తెలుసనీ, ఇక్కడ ఆడటం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పాడు.