RCB vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 24వ మ్యాచ్ లో ఆర్సీబీపై డీసీ సూపర్ విక్టరీ అందుకుంది. గురువారం బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కేఎల్ రాహుల్ 93 పరుగుల అద్భుతమైన అజేయ ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీకి బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ గ్రౌండ్ లో ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది వరుసగా రెండో ఓటమి. అంతకుముందు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.
164 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
Image Credit: TwitterDelhi Capitals
ఆర్సీబీ ఆరంభం అదిరింది కానీ..
ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం లభించింది. కానీ, పవర్ ప్లే తర్వాత బెంగళూరు టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. టిమ్ డేవిడ్ 20 బంతుల్లో 37 పరుగుల ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 17 బంతుల్లో 37 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 23 బంతుల్లో 25 పరుగులు, విరాట్ కోహ్లీ 14 బంతుల్లో 22 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
కేఎల్ రాహుల్ ఆర్సీబీ బౌలింగ్ ను దంచికొట్టాడు
164 పరుగులు టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు మంచి ఆరంభం లభించలేదు. త్వరగానే వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు రన్ రేట్ తగ్గడంతో ఒత్తిడిలోకి జారుకుంది. అయితే, మరో ఎండ్ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ తో కలిసి 111 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీ టీమ్ ను విజయం వైపు నడిపించాడు.
37 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన రాహుల్.. ఆ తర్వాత మరింత దూకుడు బ్యాటింగ్ చేశాడు. జోష్ హాజిల్‌వుడ్ వేసిన 15వ ఓవర్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఏకంగా 22 పరుగులతో బెంగళూరు స్టేడియాన్ని హోరెత్తించాడు. 93 పరుగుల అజేయ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లతో ఢిల్లీకి విజయాలు అందించాడు కేఎల్ రాహుల్.