IPL KKR vs SRH: Kolkata Knight Riders beat Sunrisers Hyderabad by 80 runs
IPL 2025 KKR vs SRH: సునామీ ఇన్నింగ్స్ లను ఆడే ప్లేయర్లు.. ప్రత్యర్థులకు దడపుట్టించే బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో హ్యాట్రిక్ ఓటమిని ఎదుర్కొంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఆల్ రౌండర్ ప్రదర్శనతో బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొడుతూ సూపర్ విక్టరీ అందుకుంది. హైదరాబాద్ టీమ్ ను ఏకంగా 80 పరుగుల తేడాతో ఓడించింది.
IPL KKR vs SRH: Kolkata Knight Riders beat Sunrisers Hyderabad by 80 runs
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 15వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో ప్లాప్ షో చూపిస్తూ ఏకంగా 80 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఇది హైదరాబాద్ టీమ్ కు వరుసగా మూడో ఓటమి. గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన అజింక్య రహానే జట్టు కేకేఆర్ తిరిగి విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చింది. హైదరాబాద్‌ను ఓడించి కేకేఆర్ 5వ స్థానంలోకి చేరగా, ఎస్ఆర్హెచ్ 10వ స్థానంలోకి పడిపోయింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ప్యాట్ కమ్మిన్ నాయకత్వంలోని హైదరాబాద్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా టీమ్ కు వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకు సింగ్ లు అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు. ఎస్ఆర్హెచ్ ముందు 201 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది కేకేఆర్.
Venkatesh Iyer. (Photo- IPL)
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ జట్టును వైభవ్ అరోరా (3 వికెట్లు), వరుణ్ చక్రవర్తి (3 వికెట్లు), ఆండ్రీ రస్సెల్ (2 వికెట్లు) లు దెబ్బకొట్టారు. అద్భుతమైన బౌలింగ్ తో హైదరాబాద్ టీమ్ ను 120 పరుగులకే ఆలౌట్ చేశారు. ఎస్ఆర్హెచ్ 16.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది.
హైదరాబాద్ స్టార్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (4), అభిషేక్ శర్మ (2), ఇషాన్ కిషన్ (2) విఫలమయ్యారు. అయితే, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్ లు దూకుడుగా ఆడినా పెద్ద ఇన్నింగ్స్ లుగా మార్చలేకపోయారు. దీంతో హైదరాబాద్ టీమ్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
Rinku Singh (Photo: IPL)
వెంకటేష్ అయ్యర్, రఘువంశీల తుఫాను ఇన్నింగ్స్ లు
మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టుకు వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింత్ లో భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్ అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్ ల అర్థ సెంచరీలతో పాటు రింకు సింగ్ 17 బంతుల్లో అజేయంగా 32 పరుగులు చేయడంతో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఇద్దరు ఓపెనర్లు 16 పరుగులకే ఔటవడంతో కోల్ కతా టీమ్ కు మంచి ఆరంభం లభించలేదు.
అయితే, కెప్టెన్ అజింక్య రహానే (38), అంగక్రిష్ (50) ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువచ్చారు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ లు మంచి ఇన్నింగ్స్ లను ఆడారు. వెంకటేష్ అయ్యర్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. తన ఇన్నింగ్స్ లో అతను 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు కీలక ఇన్నింగ్స్ ను ఆడాడు.