WPL 2025 - Delhi Capitals vs Mumbai Indians: మహిళా ప్రీమియర్ లీగ్ 2025 (డబ్ల్యూపీఎల్ 2025) ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. శనివారం రాత్రి 7:30 గంటలకు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుని ఛాంపియన్ గా నిలిచింది. ముందుగా బౌలింగ్ లో అదరగొట్టిన ఢిల్లీ టీమ్ బ్యాటింగ్ లో పరుగులు చేయడంలో కీలక ప్లేయర్లు విఫలం కావడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
WPL Final
ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై టీమ్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. ముంబై ఇండియన్స్ తమ 20 ఓవర్లలో 149/7 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 44 బంతుల్లో కీలకమైన 66 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడారు.
ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండోసారి టైటిల్ గెలుచుకుంది. అంతకుముందు, ముంబై జట్టు 2023లో ఛాంపియన్‌గా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో ఫైనల్లో ఓటమిపాలైంది. ఢిల్లీ మూడు WPL ఫైనల్స్ ఆడింది. ఆ మూడింటిలోనూ ఓడిపోయింది.
wpl, Mumbai, wpl 2025,
మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ ఫలితాలు
2023- ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2024 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.
2025 - ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ముంబై ఉంచిన 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. మారిజాన్ కాప్ 26 బంతుల్లో అత్యధికంగా 40 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది కానీ, జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. 18వ ఓవర్‌లో ఆమె నాట్ స్కైవర్ బ్రంట్ బౌలింగ్ లో ఔట్ అయ్యారు. అదే ఓవర్లో శిఖా పాండే ఖాతా తెరవకుండానే ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి ఓవర్లో ఢిల్లీ 14 పరుగులు చేయాల్సి వచ్చింది. నిక్కీ ప్రసాద్, శ్రీ చరణి (3 పరుగులు నాటౌట్) జట్టును విజయపథంలో నడిపించలేకపోయారు. నిక్కీ 23 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.