
WPL 2025 - Delhi Capitals vs Mumbai Indians: మహిళా ప్రీమియర్ లీగ్ 2025 (డబ్ల్యూపీఎల్ 2025) ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ముంబై జట్టు థ్రిల్లింగ్ విక్టరీ అందుకుని ఛాంపియన్ గా నిలిచింది. ఢిల్లీ టీమ్ మూడో సారి కూడా ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయి ట్రోఫీ అందుకోవడానికి మళ్లీ అడుగు దూరంలోనే ఆగిపోయింది. ఇక ముంబై జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది.
రెండో మహిళా ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్
మహిళల ప్రీమియర్ లీగ్ 2025 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎనిమిది పరుగుల తేడాతో ఓడించి ముంబై ఇండియన్స్ రెండో టైటిల్‌ను సాధించింది. బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు ఢిల్లీ ముందు 150 పరుగుల టార్గెట్ ను ఉంచింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సూపర్ ఇన్నింగ్స్ (44 బంతుల్లో 66 పరుగులు)తో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. నటాలీ స్కైవర్-బ్రెంట్ మూడు వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టింది. ఢిల్లీ జట్టులో టాప్ స్కోరర్ మారిసానే కాప్ 40 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడారు కానీ, జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఢిల్లీ ఫైనల్లో ఓడిపోవడం ఇది వరుసగా మూడోసారి. ముంబైకి ఇది రెండో మహిళా ప్రీమియర్ లీగ్ టైటిల్.
DC vs MI: చివరి ఓవర్ వరకు సాగిన థ్రిల్లింగ్ మ్యాచ్ !
చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 23 పరుగులు అవసరంకాగా, హేలీ మాథ్యూస్ వేసిన మొదటి బంతికి నికి ప్రసాద్ ఒక పరుగు చేయగా, మలయాళీ ప్లేయర్ మిన్ను మణి (4) రెండో బంతికే ఔటయ్యారు. మూడో బంతికి చరణి ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. నాలుగో బంతికి ఒక పరుగు. ఐదో బంతికి నికి సిక్స్ కొట్టారు. 6వ బంతికి మరో సింగిల్ వచ్చింది.
చివరి ఓవర్లో ఢిల్లీ గెలవడానికి 14 పరుగులు అవసరం అయ్యయి. చివరి ఓవర్ వేయడానికి స్కివర్ వచ్చారు. మొదటి బంతికే నికి ఒక పరుగు చేయగా, రెండో బంతికి చరణి కూడా సింగిల్ తీసుకుంది. మూడో బంతికి ఒక్క పరుగు కూడా రాలేదు. నాలుగో బంతికి నికి ఒక పరుగు చేశారు. ఐదవ బంతికి ఒక పరుగు రాగా, స్కివర్ చివరి బంతికి ఒకే ఒక పరుగు ఇచ్చారు. దంతో ముంబై టీమ్ డబ్ల్యూపీఎల్ 2025 టైటిల్ గెలుచుకుంది.
ఢిల్లీ కొంపముంచిన టాపార్డర్ !
ఢిల్లీ క్యాపిటల్స్ కు మంచి ఆరంభం లభించలేదు. ఎనిమిది ఓవర్లలో 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిది. కెప్టెన్ మెగ్ లానింగ్ (13), షెఫాలి వర్మ (4), జెస్ జోనాసెన్ (13), అన్నాబెల్ సదర్లాండ్ (2)ల వికెట్లు కోల్పోయింది. జెమిమా రోడ్రిగ్స్ (30), కాప్ (40) ఇన్నింగ్స్ ఢిల్లీకి కొంత ఉపశమనం కలిగించింది. నికి ప్రసాద్ (23 బంతుల్లో 25 నాటౌట్) గెలుపు ఆశను కలిగించారు కానీ విజయాన్ని అందించలేకపోయారు. సారా బ్రేస్ (5), శిఖా పాండే (0), మిన్ను మణి (4). చరణి (3)లు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. అమేలియా కెర్ రెండు వికెట్లు పడగొట్టింది.
హర్మన్ ప్రీత్ కౌర్ సూపర్ ఇన్నింగ్స్ తో ముంబైని నిలబెట్టింది !
పరుగులు చేయడానికి ప్లేయర్లు ఇబ్బంది పడుతుండగా, వరుసగా వికెట్లు పడుతుంటే హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ముంబైని నిలబెట్టారు. 44 బంతుల్లో 66 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడారు. తన ఇన్నింగ్స్ లో హర్మన్ ప్రీత్ కౌర్ 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు. నటాలీ స్కైవర్‌బ్రాండ్ 30 పరుగులు చేసింది. కమలిని (10), అమన్‌జోత్ కౌర్ (13 నాటౌట్) రెండంకెల స్కోరు చేసిన ప్లేయర్లు. మలయాళీ స్టార్ సజన సజీవన్ (0) నిరాశపరిచింది.
ఢిల్లీ తరఫున మారిస్సేన్ కాప్, జెస్ జోనాసెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ముంబైకి కూడా మంచి శుభారంభం లభించలేదు. ముంబై స్కోరు బోర్డులో కేవలం 14 పరుగుల వద్ద హేలీ మాథ్యూస్ (3), యష్టికా భాటియా (8)ల వికెట్లను కోల్పోయింది.
ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో ఫైనల్లో ఓటమిపాలైంది. ఢిల్లీ మూడు WPL ఫైనల్స్ ఆడింది. ఆ మూడింటిలోనూ ఓడిపోయింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ ఢిల్లీ జట్టుకు అందని ద్రాక్షగానే మిగిలింది.
మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ ఫలితాలు
2023- ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం .
2024 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.
2025 - ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 పరుగుల తేడాతో విజయం.