Sunrisers Hyderabad: మూడొందలేమో కానీ మూడు సార్లు మట్టికరిచారు
ఐపిఎల్ 2025 ఆరంభంలో మూడొందలు కొట్టే దమ్మున్న జట్టుగా గుర్తింపుపొందిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడు ఓటములను చవిచూసింది. కాటేరమ్మ కొడుకులు, అంబర్ పేట్ అభిషేక్ లు ఏం చేయలేకపోతున్నారు.
ఐపిఎల్ 2025 ఆరంభంలో మూడొందలు కొట్టే దమ్మున్న జట్టుగా గుర్తింపుపొందిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడు ఓటములను చవిచూసింది. కాటేరమ్మ కొడుకులు, అంబర్ పేట్ అభిషేక్ లు ఏం చేయలేకపోతున్నారు.
Sunrisers Hyderabad : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ లో ఉంటుంది. పరుగుల దాహంతో క్రీజులోకి వచ్చి పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ భారీ షాట్లు ఆడేవాళ్లతో ఈ జట్టు నిండిపోయింది. బంతిని పిచ్చకొట్టుకు కొడుతూ బౌలర్లకు ఉతికారేయడమే హైదరాబాద్ బ్యాటర్లకు తెలిసింది. ఇలా ధనాధన్ హిట్లర్లను కలిగివుండటం ఎస్ఆర్‌హెచ్ బలమే కాదు బలహీనత కూడా.
గతంలో విలియమ్సన్, వార్నర్ జమానాలో సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే లో స్కోరింగ్ మ్యాచులను కూడా గెలిచే సత్తావున్న జట్టు. కానీ తర్వాత సీన్ మారింది... కమిన్స్ కెప్టెన్సీలో హెడ్, అభిషేక్, క్లాసేన్ వంటి హిట్టర్లు మెరిసారు. దీంతో లో స్కోరింగ్ సన్ రైజర్స్ హై స్కోరింగ్ టీమ్ గా అవతరించింది.
కాటేరమ్మ కొడుకు క్లాసేన్ బ్యాట్ పడితే బంతి మైదానం అవతల పడాల్సిందే, భారీ షాట్లతో బౌలర్లకు హెడెక్ తెప్పించే హెడ్, అభిషేక్ శర్మ... మిడిల్ ఆర్డర్ లో ఇరగదీసే ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, కమిన్స్... ఈ సీజన్ లో రెచ్చిపోతున్న యువకెరటం అనికేత్ వర్మ. ఇలాంటి పటిష్ట బ్యాటింగ్ మిగతా ఏ జట్టులో లేదు. దీంతో ఐపిఎల్ 2025 లో 'అబ్ కీ బార్... 300 పార్' (ఈసారి 300+ స్కోరు) ఖాయమని హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు భావించారు.
అయితే సన్ రైజర్స్ ఆరంభం అదిరినా తర్వాత మ్యాచుల్లో ప్రదర్శనే ఆందోళన కలిగిస్తోంది. ఐపిఎల్ 2025 ని 286 పరుగులతో ప్రారంభించింది సన్ రైజర్స్... దీంతో ఈసారి 300 పరుగుల రికార్డు ఈ టీంతోనే సాధ్యమని వాదనకు మరింత బలం పెరిగింది.
అయితే ప్రస్తుతం హైదరాబాద్ టీం ఆటచూసి అందరూ అవాక్కవుతున్నారు. 300 కాదుకదా కనీసం 200 పరుగులు చేయడానికి ఆ టీం ఆపసోపాలు పడుతోంది. ఇలా మూడొందల స్కోరు చేస్తుందనుకున్న హైదరాబాద్ మూడుసార్లు మట్టికరిచింది.
సన్ రైజర్స్ వరుస ఓటములకు కారణాలివే..
వచ్చాడు... కొట్టాడు... వెళ్లాడు... ఈ యాటిట్యూడే సన్ రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచుతోంది. క్రికెట్ అంటే ధనాధన్ షాట్లతో రెచ్చిపోయి ఆడటం కాదు... కానీ ఇదే హీరోయిజంగా చాలామంది క్రికెటర్లు భావిస్తుంటారు. ఇదే నిజమైతే సచిన్ టెండూల్కర్ కంటే వీరేంద్ర సెహ్వాగ్ గొప్ప క్రికెటర్ అయ్యేవాడు. కానీ ఓపిగ్గా, సహనంగా ఆడితే క్రికెట్ లో అద్భుతాలు చేయవచ్చని సచిన్ తో పాటు రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు నిరూపించారు. ఈ విషయం ఎస్ఆర్‌హెచ్ కు అర్థంకావడం లేదు. అందువల్లే అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటితే ఆ జట్టు ఆటతీరు మాత్రం అధ:పాతాళానికి పడిపోతోంది.
హిట్టింగ్ ఒక్కటి చాలు... తమను గెలిపిస్తుందనే మైండ్ సెట్ ను సన్ రైజర్స్ మార్చుకోవాలి. సమయోచితంగా ఆడటం నేర్చుకోవాలి. లేదు... మేమింతే, ఇలాగే ఆడతాం అంటే ఎవరూ ఏం చేయలేరు. ఎప్పుడో ఓసారి అన్నీ కలిసొచ్చి 300 కొట్టొచ్చు... కానీ ప్రతిసారి ఇది సాధ్యం కాదు... ఇలాంటి ఆటతీరుతో వరుస విజయాలు సాధించలేరు. ఇప్పటికే ఈ విషయం స్పష్టమయ్యింది.
ఇక ఎస్ఆర్‌హెచ్ ఓ ముగ్గురునలుగురిపైనే ఆధారపడుతుంటుంది. మరీముఖ్యంగా ఓపెనర్ల హెడ్, అభిషేక్ శర్మ... మిడిల్ ఆర్డర్ లో క్లాసేన్, కమిన్స్, నితీష్ కుమార్ ల పైనే ఆ జట్టు ఆశలన్నీ. ఈ సీజన్ లో ఇషాన్ కిషన్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. వీరిలో ఎవరో ఒకరు బాగా ఆడితే చాలనుకుంటోంది ఎస్ఆర్‌హెచ్. కానీ అందరూ సమిష్టిగా ఆడితే బాగుండని అనుకోవడం లేదు... అలా జరగనన్ని రోజులు హైదరాబాద్ టీంకు విజయాలు కష్టమే. ఒకరిద్దరి వల్ల వచ్చే అరకోర విజయాలు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు.
గతేడాది రికార్డులు కొల్లగొట్టిన ఓపెనర్లు ఈ ఏడాది ఆశించినస్థాయిలో ఆడటంలేదు. మొదటి మ్యాచ్ లో బాగా ఆడారు కాబట్టే భారీ స్కోరు సాధ్యమయ్యింది... కానీ తర్వాత వారు విఫలమవడంతో వరుస ఓటములు చవిచూస్తోంది. దీన్నిబట్టి ప్రత్యర్ధులకు ఎస్ఆర్‌హెచ్ బలం ఓపెనర్లే అని అర్థమయ్యింది... అందువల్లే వారి వికెట్లు త్వరగా తీయడం ద్వారా జట్టును దెబ్బతీయవచ్చని తెలిసింది. దీంతో ఓపెనర్లను టార్గెట్ చేసి హైదరాబాద్ టీం ను మట్టికరిపిస్తున్నారు. కాబట్టి సన్ రైజర్స్ కూడా ఓపెనర్లపై ఎక్కువగా ఆధారపడకుండా వ్యూహం మార్చాలి. లేదంటే ఇకపై జరిగే మ్యాచుల్లో కూడా హైదరాబాద్ టీంకు అపజయాలు తప్పేలా లేవు.
ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగే కాదు బౌలింగ్, ఫీల్డింగ్ అట్టర్ ప్లాప్ :
ఇంతకాలం బ్యాటింగే తమ బలమని నమ్మిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు తత్వం భోధపడుతోంది... క్రికెట్ అంటే హిట్టింగ్ షో కాదు టెక్నికల్ గేమ్ అర్థమైనట్లుంది. అందువల్లే ఇటీవల వరుస ఓటముల తర్వాత కెప్టెన్ కమ్మిన్స్ మాటల్లో మార్పు వచ్చింది. ఇంతకాలం పరిస్థితులు ఎలా ఉన్న దూకుడుగా ఆడటమే తమ బలమని... భారీ షాట్లతో ప్రత్యర్ధి జట్లపై ఒత్తిడితేవడమే తమ విజయ రహస్యమని చెప్పేవాడు. కానీ నిన్న(గురువారం) కెకెఆర్ చేతిలో ఓటమి తర్వాత ఫీల్డింగ్ బాగాచేయలేకపోవడమే ఓటమికి కారణమని స్వయంగా కమ్మిన్స్ ఒప్పుకున్నాడు.
కెప్టెన్ బైటపెట్టడంలేదుగానీ వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నప్పటికీ సన్ రైజర్స్ బౌలింగ్ విభాగంలో ఇప్పటికీ బలహీనమే. టీమిండియా బౌలర్లు మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఆసిస్ బౌలర్లు పాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా వంటివారు ఉన్నా ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించేలా సత్తాచాటడం లేదు. అందువల్లే బౌలింగ్ కంటే ధనాధన్ బ్యాటింగ్ పైనే సన్ రైజర్స్ ఆధారపడుతోంది. ఈ తీరు మారకుంటే ఎస్ఆర్‌హెచ్ గెలవడం చాలా కష్టం.
మొత్తంగా ఒకప్పుడు 150, 160 పరుగులు కొట్టి గెలిచిన టీం కావాలి... అనుకూల సమయంలో 300 పైగా పరుగులు సాధించే టీం కావాలి. అటు బ్యాటర్లు రాణించాలి, బౌలర్లు రాణించాలి. మైదానంలో చిరుతల్లా కదిలే ఫీల్డర్లు కావాలి. ఇలా అన్ని విభాగాల్లో మెరుగుపడితేనే సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాలబాట పట్టేది. లేదు మేం కేవలం బ్యాటింగ్ పైనే ఆధారపడతాం అంటే ఓటములను అలవాటు చేసుకోవాల్సిందే. మరి సన్ రైజర్స్ టీం ఇకపై ఎలా ఆడుతుందో చూద్దాం.