Indian Premier League 2025 : ఐపిఎల్ 2025 లో వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ మళ్ళీ గాడిలో పడింది. ఇదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటముల ప్రయాణం కొనసాగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్లు గురువారం తలపడగా ఆతిథ్య జట్టుదే పైచేయిగా నిలిచింది. హోంగ్రౌండ్ లో ఎంఐ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో రాణించిన ఎంఐ విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచి మొదట బౌలింగ్ ను ఎంచుకున్నాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. అతడి నిర్ణయం సరైనదే... భారీ హిట్టర్లతో నిండిన సన్ రైజర్స్ ను కేవలం 162 పరుగులకే నిలువరించగలిగారు. ఆ తర్వాత 18.1 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి ఈ లక్ష్యాన్ని చేధించారు. దీంతో ఎంఐ పాయింట్స్ టేబుల్ లో మరింత పైకి ఎగబాకింది.
ముంబై విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మొదట బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో అదరగొట్టాడు. అతడి అద్భుత ప్రదర్శనే ముంబైని గెలిపించింది. బంతితో మ్యాజిక్ చేసిన విల్ జాక్స్ 3 ఓవర్లేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. కీలకమైన హెడ్, ఇషాన్ కిషన్ వికెట్లను ఇతడే పడగొట్టాడు.
బ్యాటింగ్ విషయానికి వస్తే ముంబైలో టాప్ స్కోరర్ గా నిలిచాడు జాక్స్. లక్ష్య చేధనలో ముంబై కాస్త తడబడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన జాక్స్ కేవలం 26 బంతుల్లో 36 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసాడు. అతడి సూపర్ ఇన్నింగ్స్ తో ముంబై విజయం ఖాయమయ్యింది. ఇలా జాక్స్ ముంబైని జాకీ పెట్టి లేపిమరీ విజయాన్ని అందించాడు.