చెప్పిన పని చేయకపోతే మా నాన్న బెల్టు తీసుకొని చితక్కొట్టేవాడు, మా అక్కలంతా కలిసి... - ఖలీల్ అహ్మద్

First Published Mar 29, 2023, 3:15 PM IST

ఐపీఎల్ నుంచి టీమిండియాలోకి వచ్చిన బౌలర్లలో ఖలీల్ అహ్మద్ ఒకడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏకంగా రూ.5 కోట్ల 25 లక్షలు పెట్టి ఖలీల్ అహ్మద్‌ని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి బయటపెట్టాడు ఖలీల్ అహ్మద్...
 

‘నాకు ముగ్గురు అక్కలు. టోంక్ జిల్లాలో ఓ ఆసుపత్రిలో మా నాన్న కాంపౌండర్‌గా పనచేసేవారు. మా నాన్న తన పని మీద బిజీబిజీగా తిరిగేవారు. దీంతో ఇంట్లోకి కావాల్సిన పాలు, కూరగాయాలు, వంట సామాను అంతా తీసుకురావాల్సిన బాధ్యత నాపైన ఉండేది..  అయితే నేను ఇవేమీ పట్టించుకోకుండా గ్రౌండ్‌కి వెళ్లి ఆడుకునేవాడిని...

మా నాన్న ఇంటికి రాగానే మా అమ్మ వెళ్లి ‘వీడు చెబితే వినడం లేదని, చెప్పిన పనులు చేయడం లేదని’ ఒకటికి రెండు కలిపించి చెప్పేది. ఆ టైమ్‌లో నేను గ్రౌండ్‌లో ఉండేవాడిని. ఇక మా నాన్న, కోపంగా వచ్చేవాడు...

సరిగా చదవడం లేదని, కనీసం చెప్పిన పని చేయడం లేదని తన బెల్టు తీసుకుని చితకబాదేవాడు. నా శరీరం మీద ఆ బెల్టు మరకలు పడేవి. ఇక ఆ రాత్రి మా అక్కలు, ఆ గాయాలకు మందు రాసేవాళ్లు...

మా నాన్న చిన్నతనం నుంచి నన్ను డాక్టర్ చేయాలని కలలు కన్నారు. డాక్టర్ అయితే నా భవిష్యత్తు చాలా బాగుంటుందని అనుకున్నారు. అయితే క్రికెట్‌లో నేను రాణించడం మొదలెట్టాక ఆయన కూడా సహకరించడం మొదలెట్టారు...

ఆయనకి వచ్చిన పెన్షన్ డబ్బులను కూడా నా క్రికెట్ కోసం ఖర్చు పెట్టారు. అండర్19 టీమ్‌కి సెలక్ట్ అయ్యి, 21 వికెట్లు తీశాను. అప్పుడు నా ఫోటో పేపర్‌లో వచ్చింది. నాకు వచ్చిన అలవెన్సులు కూడా తీసుకెళ్లి మా నాన్నకి ఇచ్చాను. ఇప్పటికీ ఆ క్షణాలు తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోతా..’ అంటూ చెప్పుకొచ్చాడు ఖలీల్ అహ్మద్..
 

2016-17 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన ఖలీల్ అహ్మద్, ఆ తర్వాత నాలుగు సీజన్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడాడు. 2022 సీజన్‌లో మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌కి మారాడు.2018 ఆసియా కప్‌లో ఆడిన ఖలీల్ అహ్మద్, టీమిండియా తరుపున 11 వన్డేలు, 14 టీ20 మ్యాచులు ఆడి మొత్తంగా 28 వికెట్లు పడగొట్టాడు.  

click me!