ఐపీఎల్ లోకి రిషభ్ పంత్ ఎంట్రీ..? ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్న డీడీసీఎ

First Published Mar 31, 2023, 11:57 AM IST

IPL 2023: మూడు నెలల క్రితం  రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం విరామం తీసుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్  ఐపీఎల్ లో భాగం కానున్నాడు. 

గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడి  తీవ్ర గాయాలపాలై   ప్రస్తుతం  ఇంటిలో విశ్రాంతి  తీసుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషభ్ పంత్   ఈ ఐపీఎల్ సీజన్ లో భాగం కాబోతున్నాడు. అదేంటి..? కాలికి గాయంతో   ఉన్న పంత్.. నడవడమే కష్టంగా ఉంటే  మ్యాచ్ లు ఎలా ఆడతాడు..? అనుకుంటున్నారా..?  

అయితే పంత్  కనిపించేది ప్లేయర్ గా కాదు.  ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్ లో   అతడు ఉండనున్నాడు.   రెండ్రోజుల క్రితమే  ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘మేం డగౌట్ లో  పంత్ ఉండాలని కోరుకుంటున్నాం. అతడు ఉంటే  టీమ్ లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి..  ఢిల్లీ ఆడబోయే మ్యాచ్ లకు పంత్ వస్తాడనే అనుకుంటున్నాం..’ అని చెప్పాడు.  

పాంటింగ్ కోరికో లేక ఢిల్లీ క్యాపిటల్స్  ప్లానింగో తెలియదు గానీ   ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ స్వంత గ్రౌండ్  (అరుణ్ జైట్లీ స్టేడియం - ఢిల్లీ)  లో జరిగే మ్యాచ్ లను పంత్ ప్రత్యక్షంగా వీక్షించనున్నాడు.  ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.   

ఇదే విషయమై  డీడీసీఏ   డైరెక్టర్ శ్యామ్ శర్మ  మాట్లాడుతూ.. ‘మేం రిషభ్ పంత్  ను డగౌట్ కు తీసుకొచ్చేందుకు గాను అన్ని ఏర్పాట్లను చేశాం. అతడి కోసం ఓ ప్రత్యేక ర్యాంప్ ను కూడా  సిద్ధం  చేశాం.  ఇంటి నుంచి  స్టేడియానికి, స్టేడియం నుంచి ఇక్కడికి  పంత్ ను తీసుకురావడానికి సిద్దంగా ఉన్నాం...’అని తెలిపాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్ ను ఏప్రిల్ 1న  లక్నో వేదికగా జరుగబోయే  మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ తర్వాత  ఏప్రిల్ నాలుగున గుజరాత్ టైటాన్స్ తో   రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు  పంత్ హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  
 

గతేడాది  ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో  ఐదో స్థానంలో నిలిచింది. ఈసారి పంత్ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటే అయినా డేవిడ్ వార్నర్,  పృథ్వీ షా,  మిచెల్ మార్ష్,  ఫిల్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్, ఆన్రిచ్ నోర్త్జ్, అక్షర్ పటేల్,   ముస్తాఫిజుర్ రెహ్మాన్ వంటి ఆటగాళ్లతో ఢిల్లీ   జట్టు బలంగానే ఉంది.  ఈ సీజన్ లో అయినా ఢిల్లీ తమ కప్పు కలను నెరవేర్చుకుంటుందో చూడాలి.  

click me!