ఫిక్సింగ్ అనే ముందు, మీ క్రికెటర్ల జాతకాలు చూసుకోండి... పాక్ ఫ్యాన్స్‌కి హర్భజన్ సింగ్ కౌంటర్...

First Published Nov 6, 2021, 7:58 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది టీమిండియా. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి, భారీ విజయాన్ని అందుకుంది... అయితే భారత జట్టు విజయాన్ని పాక్ ప్రజలు తట్టుకోలేకపోయారు...

టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆఫ్ఘాన్ ఫీల్డర్లు చేసిన కొన్ని తప్పిదాలను చూపించి, ‘ఫిక్సింగ్’ జరిగిందంటూ భారత జట్టుపై తీవ్ర ఆరోపణలు చేశారు...

అదీకాకుండా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ కెప్టెన్ మహ్మద్ నబీ, తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం... టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం టాస్ గెలిచి, ఫీల్డింగ్ తీసుకోవడం వంటివి పాక్ జనాలకు ఫిక్సింగ్ ఆరోపణలు చేయడానికి కారణమయ్యాయి...

అదీకాకుండా పాక్‌తో మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఆఫ్ఘాన్ ప్లేయర్లు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకోవడం, భారత్‌తో మ్యాచ్ తర్వాత నవ్వుతూ సంతోషంగా ఉండడంతో కచ్ఛితంగా పిక్సింగ్ అంటూ తీవ్రంగా ఆరోపణలు చేస్తూ, సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు పాక్ జనాలు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్, ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన పాక్ జనాలకు అదిరిపోయే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చాడు భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్...

‘టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ బాగా ఆడిందని మనం ఒప్పుకోవాల్సిందే. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆడిన విధానాన్ని భారత ప్రజలు కూడా ఎంతగానో ప్రశంసించారు...

టీమిండియాపై తొలి విజయం అందుకున్నందుకు పాకిస్తాన్‌కి అభినందనలు. అయితే భారత జట్టు ఆటతీరును తట్టుకోలేక అన్యాయంగా మీరు చేస్తున్న ఆరోపణలు, మీ ఆటను అనుమానించేలా చేస్తున్నాయి...

మాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసే ముందు, మీ క్రికెటర్ల జాతకాలు చూసుకోండి ఓసారి... ఎంతమంది ఫిక్సింగ్‌కి పాల్పడి, నిషేధానికి గురయ్యారో కాసేపు గుర్తు చేసుకోండి...

భారత జట్టు విజయాన్ని పాకిస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా ఏళ్లుగా భారత జట్టును ఓడించాలని వాళ్లు కలలు కన్నారు. అది ఈసారి నెరవేరింది... ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, వారి ఆటతీరుపై అనుమానాలు వస్తాయి...

భారత జట్టుపై, రషీద్ ఖాన్‌పై నీచమైన ఆరోపణలు చేయడం మాత్రం దారుణం. ఇలాంటి పనులు చేసి పాక్ క్రికెట్‌కి మరోసారి అప్రతిష్ట తీసుకురాకండి...’ అంటూ కామెంట్లు చేశాడు హర్భజన్ సింగ్...

ఆఫ్ఘాన్, భారత జట్టు మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్న పాక్ ఫ్యాన్స్‌కి అదే రేంజ్‌లో కౌంటర్ ఇస్తున్నారు టీమిండియా ప్యాన్స్... ఫిక్సింగ్ జరిగింది నిజమేనని, లేకపోతే పాక్ జట్టు ఇలా ఆడడం ఏంటి, కామెడీ కాకపోతే అంటూ పంచ్ ఇస్తున్నారు...
 

పాక్ క్రికెటర్లు మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్‌తో పాటు దాదాపు ఆరుగురు పాకిస్తాన్ క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నాలుగేళ్ల క్రితం నిషేధానికి గురయ్యారు. వీరితో పాటు సలీమ్ మాలిక్,  డానిష్ కనేరియా, షార్జీల్ ఖాన్, ఉమ్రాన్ అక్మల్, నవీద్ అరిఫ్ వంటి పదుల సంఖ్యలో క్రికెటర్లు ఫిక్సింగ్‌కి పాల్పడి, ఐసీసీ వేటుకి గురయ్యారు. 

click me!