ధోనీ టీమ్‌లో ఏం జరుగుతోంది? మాహీ వెళ్లిపోతాడనే భయంతో ఇన్ని అలజడులా...

First Published May 14, 2022, 3:53 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో అలజడులు రేగుతూనే ఉన్నాయి. అయితే ఎమ్మెస్ ధోనీ వచ్చే సీజన్‌లో ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారడంతో సీఎస్‌కే నెక్ట్స్ కెప్టెన్ ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌ని వెంటాడిన ప్రశ్న ఇదే... అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రశ్నే అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది...

ఐపీఎల్ 2022  ఆరంభానికి ముందు ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో, రవీంద్ర జడేజా సారథిగా సీజన్‌ని ప్రారంభించింది చెన్నై సూపర్ కింగ్స్...

అయితే సరైన విజయాలు అందుకోలేకపోవడంతో 8 మ్యాచులు ముగియగానే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు రవీంద్ర జడేజా... దీంతో తిరిగి సారథిగా ఎమ్మెస్ ధోనీ బాధ్యతలు అందుకున్నాడు...

Latest Videos


2021 సీజన్‌లో సీఎస్‌కే టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా గాయం కారణంగా పూర్తి సీజన్‌కి దూరమయ్యాడు. కెప్టెన్‌గా సీజన్‌ని ఆరంభించిన జడ్డూ, ఇలా సడెన్‌గా సీజన్ మధ్యలోనే టీమ్ నుంచి బయటికి వెళ్లడం అనేక అనుమానాలకు తావిచ్చింది...

తాజాగా అంబటి రాయుడు, ఇదే ఆఖరి సీజన్ అంటూ ట్వీట్ చేశాడు. 36 ఏళ్ల రాయుడు, ఐపీఎల్ నుంచి తప్పుకోవడం పెద్ద షాకింగ్ విషయమేమీ కాదు. అంతలోనే అంబటి రాయుడు రిటైర్మెంట్ ట్వీట్ డిలీట్ చేశాడు... రాయుడు, ఇప్పుడే రిటైర్మెంట్ ఇవ్వడం లేదని సీఎస్‌కే సీఈవో క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది...

చూస్తుంటే చెన్నై సూపర్ కింగ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఎమ్మెస్ ధోనీ వచ్చే సీజన్‌లో రిటైర్మెంట్ తీసుకుంటాడనే విషయం, ఆ జట్టును చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

టీమ్ సెలక్షన్ దగ్గర్నుంచి, ప్రతీ విషయంలో ఎమ్మెస్ ధోనీ చెప్పిందే వేదంగా సాగుతుంది సీఎస్‌కేలో. వేరే జట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని సీనియర్లను వేలంలో ఏరి కోరి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

ఈ సీనియర్లను మేనేజ్ చేయడం కొత్త కెప్టెన్ల వల్ల అయ్యే పని కాదు. 10 సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉంటున్న రవీంద్ర జడేజా త్వరగానే ఈ విషయాన్ని గుర్తించి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 

ఇప్పుడు సీఎస్‌కే తర్వాతి కెప్టెన్ ఎవరనేదాని కంటే ఈ సీజన్‌లో ఆ టీమ్‌లో ఏం జరుగుతోందనేది చాలా పెద్ద అంతుచిక్కని ప్రశ్నగా మారింది...

click me!