ఆ ఇద్దరినీ అందుకే రిటైన్ చేసుకోలేదు... రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ కుమార సంగర్కర...

First Published Dec 2, 2021, 11:05 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన జట్టు రాజస్థాన్ రాయల్స్. ఇంగ్లాండ్ క్రికెట్ స్టార్లతో నిండిన రాజస్థాన్ రాయల్స్, ఇద్దరు వికెట్ కీపర్లను, ఓ అన్‌క్యాప్డ్ ఓపెనర్‌ని మినహాయిస్తే ఎవ్వరినీ రిటైన్ చేసుకోలేదు...

ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వేలంలోకి వెళితే, అతనికి ఉన్న క్రేజ్‌కి ఈజీగా రూ.12 నుంచి రూ.16 కోట్ల దాకా ధర పలకడం ఖాయం. అయినా బెన్ స్టోక్స్‌ని అట్టిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు రాజస్థాన్ రాయల్స్...

అలాగే ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా అంతే. ఆర్చర్‌, ఐపీఎల్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఇస్తాడు. కీలక సమయంలో వికెట్లు తీయడమే కాకుండా డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, అవసరమైనప్పుడు సిక్సర్ల మోత మోగిస్తాడు...

ఐపీఎల్ 2022 సీజన్ కోసం రూ.14 కోట్లతో కెప్టెన్ సంజూ శాంసన్‌ను రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్, 10 కోట్లకు జోస్ బట్లర్‌ని అట్టిపెట్టుకుంది. అలాగే యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కి అన్‌క్యాప్డ్ రిటైన్డ్ ప్లేయర్‌గా రూ.4 కోట్లు చెల్లించనుంది ఆర్ఆర్...

‘బెన్ స్టోక్స్ బెస్ట్ ఆల్‌రౌండర్, అతన్ని చాలా రోజులుగా చూస్తన్నా. అతను కచ్ఛితమైన మ్యాచ్ విన్నర్. రాజస్థాన్ రాయల్స్‌కి బెన్ స్టోక్స్ ఎన్నో విజయాలు కూడా అందించాడు...

జట్టు కోసం బెన్ స్టోక్స్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. లీడర్‌గానూ అతనో బ్రిలియెంట్ ప్లేయర్. బెన్ లాంటి ప్లేయర్, క్రీజులో ఉంటే ఆ ఎనర్జీ వేరేగా ఉంటుంది...

అలాంటి ప్లేయర్‌ని తప్పించడం చాలా కష్టంగానే అనిపించింది. అయితే రిటెన్షన్స్ సాధ్యాసాధ్యాలను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. గత రెండు సీజన్లలో అందుబాటులో ఉన్న ప్లేయర్ల ఆధారంగా రిటెన్షన్ డిసైడ్ చేశాం...

జోఫ్రా ఆర్చర్ కూడా అంతే. ఇప్పటికీ ఆర్చర్ గాయంపై సరైన క్లారిటీ రాలేదు. అతను కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది. తిరిగి అతను క్రికెట్‌‌లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడనేది తెలీదు...

టీ20ల్లో జోఫ్రా ఆర్చర్ లాంటి ప్లేయర్ దొరకడం ఏ టీమ్‌కైనా అదృష్టమే. అయితే అతన్ని తప్పించడానికి మా కారణాలు మాకున్నాయి. ఈ నిర్ణయం వారిని నిరుత్సాహపరిచి ఉండవచ్చు...

అయితే జట్టుకి ఏది మంచిదో అదే చేయాలి. జట్టుకి ఇన్నాళ్లు తోడుగా ఉన్న వారందరూ తిరిగి వేలం ద్వారా టీమ్‌లోకి వస్తారని ఆశిస్తున్నాం...’ అంటూ తెలిపాడు రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కుమార సంగర్కర...

తండ్రి అనారోగ్యం కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌లో లేటుగా ఎంట్రీ ఇచ్చిన బెన్ స్టోక్స్,  8 మ్యాచులు ఆడి 285 పరుగులు చేసి, 2 వికెట్లు తీసుకున్నాడు... ఐపీఎల్ 2021 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో గాయపడి, టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు...

ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత మెంటర్ హెల్త్ కారణంగా క్రికెట్‌ నుంచి బ్రేక్ తీసుకున్న బెన్ స్టోక్స్, యాషెస్ సిరీస్ ద్వారా తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి అదరగొట్టిన జోఫ్రా ఆర్చర్, గాయం కారణంగా 2021 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. గాయం కారణంగా యాషెస్ సిరీస్‌కి కూడా దూరమైన ఆర్చర్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి క్రికెట్ ఎంట్రీ ఇస్తాడని అంచనా.

click me!