నక్కతోక తొక్కేసిన హార్ధిక్ పాండ్యా... ఐపీఎల్ 2022 పర్ఫామెన్స్‌తో టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్?...

First Published May 14, 2022, 8:34 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ హార్ధిక్ పాండ్యా కెరీర్‌ని మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌లో చోటు దక్కించుకోలేకపోయిన హార్ధిక్ పాండ్యా, ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు...

అసలు ఏ మాత్రం కెప్టెన్సీ అనుభవం లేని హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌పై ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే సీజన్ ఆరంభమయ్యాక సీన్ మారిపోయింది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. అద్భుతంగా జట్టును నడిపించి, ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా గుజరాత్ టైటాన్స్‌ని నిలిపాడు...

కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా పర్ఫామెన్స్‌తో బాగా ఇంప్రెస్ అయిన భారత క్రికెట్ బోర్డు, అతనికి టీమిండియా కెప్టెన్సీ ఇవ్వాలని భావిస్తోందట... అయితే పూర్తి స్థాయి కెప్టెన్‌గా మాత్రం కాదు. తాత్కాలిక సారథిగానే...

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో స్వదేశంలో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్, జూన్ 19న జరిగే ఆఖరి టీ20తో ముగియనుంది...

ఐపీఎల్‌ కారణంగా అలిసిపోయిన భారత స్టార్ క్రికెటర్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది బీసీసీఐ. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా వంటి ప్లేయర్లందరికీ ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించబోతున్నట్టు సమాచారం...

Image Credit: Getty Images

ఇదే జరిగితే శ్రీలంక టూర్‌లో భారత జట్టును నడిపించిన శిఖర్ ధావన్‌ లేదా హార్ధిక్ పాండ్యా... భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు. లంక టూర్‌లో ధావన్ కెప్టెన్‌గా ఇంప్రెస్ చేశాడు...

అయితే భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూసి, కీ ప్లేయర్లు దూరం కావడంతో లంకతో టీ20 సిరీస్ కోల్పోయింది టీమిండియా. దీంతో శిఖర్ ధావన్ కెప్టెన్సీ తీసుకోవడానికి మరోసారి అంగీకరిస్తాడా? అనేది అనుమానంగా మారింది...

ఒకవేళ శిఖర్ ధావన్ ప్లేయర్‌గానే కొనసాగాలని భావిస్తే, హార్ధిక్ పాండ్యా నక్కతోక తొక్కినట్టే. ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటిసారి సారథిగా మారిన హార్ధిక్ పాండ్యా, భారత జట్టు ఫ్యూచర్ కెప్టెన్ రేసులోనూ నిలుస్తాడు...

click me!