మరింత ముందుకి ఐపీఎల్ 2022... డబుల్ హెడర్స్ తగ్గించేందుకు బీసీసీఐ వినూత్న ఆలోచన...

First Published Jan 7, 2022, 4:53 PM IST

IPL 2022: ఆరంభానికి ముందే క్రికెట్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచేస్తోంది ఐపీఎల్ 2022 సీజన్. పది జట్లు బరిలో దిగుతుండడం, మెగా వేలం జరగబోతుండడంతో ఈసారి సుదీర్ఘంగా సాగనుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్...

సాధారణంగా అయితే  ఏప్పిల్ 1న లేదా ఏప్పిల్ 2న ఐపీఎల్ పండగ మొదలవుతుంది. 8 జట్లతో సాగినప్పుడు 60 రోజుల పాటు ఐపీఎల్ మెగా సమరం నడిచేది...

రాబోయే సీజన్‌లో 10 ఫ్రాంఛైజీలు తలబడబోతుండడంతో ఐపీఎల్‌ సీజన్ 15... మరో 14 రోజులు అదనంగా 74 రోజుల పాటు సాగే అవకాశం ఉంది. అయితే ఈ సంఖ్య మరింత పెంచే ఆలోచనలో ఉందట ఐపీఎల్ యాజమాన్యం...

రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా చూసుకుంటే ఈ ఏడాది జనాల మధ్య ఐపీఎల్ 2022 సీజన్ నిర్వహించడం అసాధ్యమే. దీంతో మళ్లీ ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచులు నిర్వహించాల్సి ఉంటుంది...

ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించినప్పుడు ప్రధాన ఆదాయ మార్గం టీవీ వ్యూయర్‌షిప్. ఐపీఎల్ 2020 సీజన్, ఆ తర్వాత 2021 సీజన్ కూడా రికార్డు స్థాయిలో టీఆర్పీ సాధించాయి...

అయితే డబుల్ హెడర్ మ్యాచులు ఉన్న సమయంలో మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌కి సాయంత్రం మ్యాచ్‌తో పోలిస్తే వ్యూయర్‌షిప్ తక్కువగా ఉంటుంది....

అందుకే ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆఖరి గ్రూప్ మ్యాచులను వేర్వేరు సమయాల్లో కాకుండా, రెండింటినీ ఒకేసారి నిర్వహించి ప్రయోగం చేసింది ఐపీఎల్ యాజమాన్యం...

అయితే రెండు మ్యాచులు ఒకేసారి ప్రసారం చూస్తే, వ్యూయర్‌షిప్ కూడా విభజించబడుతుంది. అందుకే డబుల్ హెడర్స్ తగ్గించేందుకు మార్గాలను వెతుకుతోందట బీసీసీఐ...

ఏప్రిల్ 2కి వారం ముందు మార్చి 25న ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచులను ఆరంభించాలని చూస్తోందట బీసీసీఐ. మ్యాచులు జరిగే రోజుల సంఖ్య పెరిగితే ఛానెళ్లకు వచ్చే లాభం కూడా పెరుగుతుంది...

స్పాన్సర్లు, ప్రకటనల ద్వారా బీసీసీఐకి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా కరోనా కేసులను బట్టి ఒకే వేదికపై లేదా రెండు వేదికలపై మ్యాచులన్నీ ముగించాలనే ఆలోచన కూడా చేస్తోందట...

ఇండియాలో ఐపీఎల్ 2022 సీజన్‌ని నిర్వహిస్తామని ముందుగానే ప్రకటించింది బీసీసీఐ. అయితే భారత్‌లో పరిస్థితులు చేయిదాటిపోతే ఈసారి కూడా యూఏఈ వేదికగానే ఐపీఎల్‌ జరిగే అవకాశం ఉంది...

అంతా బాగానే ఉన్నా, ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది భారత జట్టు. ఒకవేళ ఐపీఎల్‌కి ముందుకు జరిపితే ఈ సిరీస్‌పై ప్రభావం పడుతుంది. 

click me!