IPL 2021: అప్పుడే హార్ధిక్ పాండ్యాను తీసుకోవాలని సన్‌రైజర్స్‌కి సూచించిన ఇర్ఫాన్ పఠాన్... వీవీఎస్ ఏం చేశాడంటే

First Published Oct 4, 2021, 5:43 PM IST

ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి దూసుకొచ్చే, స్టార్‌ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు హార్ధిక్ పాండ్యా. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల హార్ధిక్ పాండ్యా, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలోనూ చోటు దక్కించుకున్నాడు...

బరోడాకి చెందిన హార్ధిక్ పాండ్యాను అందరికంటే ముందుగానే గుర్తించాడట బరోడా ఎక్స్‌ప్రెస్ ఇర్ఫాన్ పఠాన్... 2013లో బరోడా జట్టు సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీని గెలవడంతో కీ రోల్ పోషించాడు హార్ధిక్ పాండ్యా...

140 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల హార్ధిక్ పాండ్యాను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కి సూచించాడట ఇర్ఫాన్ పఠాన్...

అయితే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం ఇర్ఫాన్ పఠాన్ సూచనను తిరస్కరించారు... 8 ఏళ్ల క్రితం ఈ సంఘటన గురించి తాజాగా ఓ టీవీ ప్రోగ్రామ్‌లో మాట్లాడారు ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు...

‘నాకు ఇంకా గుర్తుంది, 2012-13 ఐపీఎల్ వేలంలో హార్ధిక్ పాండ్యాను తీసుకోవాలని వీవీఎస్‌కు సలహా ఇచ్చా... లక్ష్మణ్‌కి, నాకు మంచి స్నేహం ఉండడంతో నేను చెబితే వింటాడని అనుకున్నా... 

అయితే అప్పుడు లక్ష్మణ్ నా మాటలు విని ఉంటే, హార్ధిక్ పాండ్యా ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కి కాకుండా మరో జట్టుకి ఆడేవాడు....’ అంటూ కామెంట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

‘ఈ విషయాన్ని నేనే చెప్పాలని అనుకున్నా... 2013 సీజన్‌లో ఇర్ఫాన్ పఠాన్ నాకు ఫోన్ చేసి, బరోడా నుంచి హార్ధిక్ పాండ్యా అనే టాలెంటెడ్ క్రికెటర్ ఉన్నాడు... అతన్ని ఎస్‌ఆర్‌హెచ్‌కి తీసుకోవాలని చెప్పాడు..

అతనిలో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల సామర్థ్యం ఉందని చెప్పాడు. అప్పటికి హార్ధిక్ పాండ్యా, బరోడాకి కూడా పెద్దగా క్రికెట్ ఆడలేదు. అయితే ఇర్ఫాన్ పఠాన్ అతనిలోని టాలెంట్‌ను గుర్తించాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు వీవీఎస్ లక్ష్మణ్...

ఇర్ఫాన్ పఠాన్ సూచించిన హార్ధిక్ పాండ్యాను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించగా... దానికి సమాధానం బయటికి చెప్పలేమంటూ మాటదాటేశాడు వీవీఎస్ లక్ష్మణ్...

2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన హార్ధిక్ పాండ్యాను 2015లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది... ఆ తర్వాత పాండ్యా కెరీర్, ముంబై ఇండియన్స్ రాత రెండూ మారిపోయాయి...

ముంబై ఇండియన్స్ తరుపున 90 మ్యాచులు ఆడిన హార్ధిక్ పాండ్యా, 154.6 స్ట్రైయిక్ రేటుతో 1461 పరుగులు చేశాడు, బౌలింగ్‌లోనూ రాణించి 42 వికెట్లు తీశాడు...

2015లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాతి ఏడాదే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా తరుపున 11 టెస్టులు, 62 వన్డేలు, 49 టీ20 మ్యాచులు ఆడాడు హార్ధిక్ పాండ్యా...
 

click me!