ఐపీఎల్‌లో ఫెయిల్ అవుతున్న టీ20 వరల్డ్‌కప్ హీరోలు... టీమిండియా ఫ్యాన్స్‌లో భయాలు...

First Published Sep 27, 2021, 3:33 PM IST

ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన కుర్రాళ్లను ఏరి కోరి, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపికైన వారిలో కొందరు ప్లేయర్లు, ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో ఘోరంగా విఫలమవుతూ టీమిండియా ఫ్యాన్స్‌లో భయాలు రేపుతున్నారు...

సూర్యకుమార్ యాదవ్: ఐపీఎల్‌లో గత మూడు సీజన్లలో 400+ పరుగులు చేసి, సెలక్టర్లను ఇంప్రెస్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సర్‌తో ఆరంగ్రేటం చేసిన ‘మిస్టర్ 360 డిగ్రీస్’ సూర్యకుమార్ యాదవ్, ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...

ఫస్టాఫ్‌లో ఆర్‌సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్‌లతో జరిగిన మ్యాచుల్లో 30+ పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, సెకండాఫ్‌లో మూడు మ్యాచుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు...

ఇషాన్ కిషన్: ముంబై ఇండియన్స్ నుంచే టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపికైన వారిలో ఇషాన్ కిషన్ ఒకడు. రిషబ్ పంత్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికైన ఇషాన్ కిషన్, ఐపీఎల్ 2021 సీజన్‌లో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు... 

ఐపీఎల్ 2020లో 500+ పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఈ సారి ఒక్క మ్యాచ్‌లో కూడా 50+ స్కోరు అందుకోలేకపోయాడు... ఐపీఎల్ 2021 సీజన్‌లో 8 మ్యాచుల్లో 107 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, బ్రేక్ తర్వాత ప్రారంభమైన ఫేజ్ 2లో మూడు మ్యాచుల్లో 34 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

భువనేశ్వర్ కుమార్: ఈ మధ్య పెద్దగా ఫామ్‌లో లేకపోయినా, బుమ్రాతో కలిసి డెత్ ఓవర్లలో మ్యాజిక్ చేయగల భువనేశ్వర్‌ కుమార్‌ను టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే ఐపీఎల్ ఫేజ్ 2లో భువీ పర్ఫామెన్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 ఓవర్లలో 21 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయిన భువనేశ్వర్ కుమార్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు. బౌలింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పై ఆఖరి ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ 14 పరుగులు సమర్పించడం సన్‌రైజర్స్‌ను దెబ్బతీసింది...

హార్ధిక్ పాండ్యా: హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై రెండేళ్లుగా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆసీస్ టూర్‌లో బ్యాటుతో రాణించినా, బాల్‌తో మ్యాజిక్ చేయలేకపోయాడు హార్ధిక్ పాండ్యా. శ్రీలంక టూర్‌లో బ్యాటుతోనూ ఫెయిల్ అయ్యాడు...

అయితే హార్ధిక్ పాండ్యా గణాంకాల మీద ఉన్న నమ్మకంతో టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే ఫేజ్ 2లో మొదటి రెండు మ్యాచుల్లో ఆడని హార్ధిక్ పాండ్యా, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 6 బంతులాడి 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు...

రవిచంద్రన్ అశ్విన్: దాదాపు నాలుగేళ్ల తర్వాత టీ20 ఫార్మాట్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో చోటు దక్కించుకున్న అశ్విన్, ఐపీఎల్‌లో తన రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2.5 ఓవర్లలో 22 పరుగులిచ్చి ఒకే వికెట్ తీసిన అశ్విన్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి ఓ వికెట్ తీసి పర్వాలేదనిపించాడు...

రాహుల్ చాహార్: ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో చోటు దక్కించుకున్నవారిలో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రాహుల్ చాహార్ కూడా ఒకడు. అయితే ఫేజ్ 2లో చాహార్ పర్ఫామెన్స్ కూడా సరిగా లేదు...

సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 22 పరుగలిచ్చిన రాహుల్ చాహార్, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌ల 3 ఓవర్లలో 34 పరుగులిచ్చాడు... ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు....

ఐపీఎల్ 2021 సీజన్‌లో 10 మ్యాచుల్లో 12 వికెట్లు తీసిన రాహుల్ చాహార్, ఫేజ్ 2లో జరిగిన మూడు మ్యాచుల్లో ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. అదీకాక భారీగా పరుగులు సమర్పించాడు...

టీ20 వరల్డ్‌కప్‌కి నేరుగా ఎంపికైన వారి కంటే మెరుగ్గా స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికైన శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, శ్రేయాస్ అయ్యర్ రాణిస్తుండడం విశేషం...

అలాగే టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శిఖర్ ధావన్, ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండగా... యజ్వేంద్ర చాహాల్ మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు చాహాల్..

click me!