IPL 2021 SRH vs PBKS: జాసన్ హోల్డర్ ఒంటరి పోరాటం వృథా... పంజాబ్ కింగ్స్ ఉత్కంఠ విజయం...

First Published Sep 25, 2021, 11:19 PM IST

120 బంతుల్లో 126 పరుగుల టార్గెట్... అదీకాక సీజన్‌ ఫస్టాఫ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలిచామనే ధీమా... అయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత మాత్రం మారలేదు. బాల్‌తో రాణించి మూడు వికెట్లు తీసిన జాసన్ హోల్డర్, బ్యాటుతోనూ రాణించి... జట్టుకి విజయాన్ని అందించడానికి ఆఖరి బంతి వరకూ పోరాడినా సన్‌రైజర్స్ రాతను మాత్రం మార్చలేకపోయాడు...

 126 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్‌కి మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఫేజ్ 1లో కెప్టెన్సీ కోల్పోయి, ఫేజ్ 2లో ఫామ్‌లోకి రావడానికి తెగ కష్టపడుతున్న డేవిడ్ వార్నర్, మహ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్ మూడో బంతికే అవుట్ అయ్యాడు...

షమీ బౌలింగ్‌లో కీపర్ కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్. ఆ తర్వాత 6 బంతులాడి కేవలం 1 పరుగు చేసిన కెప్టెన్ కేన్ విలియంసన్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 

2.2 ఓవర్లలో 10 పరుగులు చేసిన సన్‌రైజర్స్, రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 2 ఓవర్లలో ఓ మెయిడిన్ ఓవర్ వేసిన మహ్మద్ షమీ, కేవలం 2 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి సెన్సేషనల్ స్పెల్‌ వేశాడు... 

వార్నర్, విలియంసన్ అవుటైన తర్వాత మనీశ్ పాండే వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో 8 ఓవర్లలో 32 పరుగులు మాత్రమే చేయగలిగింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

23 బంతులు ఆడి ఒకే ఒక్క ఫోర్ బాది 13 పరుగులు చేసిన మనీశ్ పాండే, రవిభిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 12 బంతుల్లో 12 పరుగులు చేసిన కేదార్ జాదవ్ కూడా భిష్ణోయ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...

అబ్దుదల్ సమద్ కూడా రవిభిష్ణోయ్ బౌలింగ్‌‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కాగా...  ఓపెనర్‌గా వచ్చిన వృద్ధిమాన్ సాహా 37 బంతుల్లో ఓ ఫోర్‌తో 31 పరుగులు చేసి 17వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు...

అయితే వస్తూనే నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాది 16 పరుగులు రాబట్టాడు జాసన్ హోల్డర్. 
చివరి 2 ఓవర్లలో 21 పరుగులు కావాల్సిన దశలో రషీద్ ఖాన్ భారీ షాట్‌కి ప్రయత్నించి, బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత రెండు బంతుల్లో బౌండరీ రాకపోవడంతో సింగిల్ తీయడానికి కూడా ఇష్టపడలేదు జాసన్ హోల్డర్... ఐదో బంతికి రెండు పరుగులు తీయడంతో ఆఖరి బంతికి 7 పరుగులు కావాల్సిన స్థితికి చేరింది సన్‌రైజర్స్... 

ఆఖరి బంతికి సిక్సర్ కొట్టడంలో హోల్డర్ ఫెయిల్ కావడంతో 5 పరుగుల తేడాతో ఓడింది ఆరెంజ్ ఆర్మీ... 
ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఉత్కంఠ విజయాన్ని అందుకున్న పంజాబ్ కింగ్స్... నాలుగో విజయాన్ని అందుకుంది. 

ఈ పరాజయంతో అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్కమించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మిగిలిన జట్ల గణాంకాలు కూడా సన్‌రైజర్స్‌ను ప్లేఆఫ్స్ చేర్చలేవు...

click me!