రీఎంట్రీ ఇవ్వాలంటే అక్కడ రాణించాల్సిందే... ఆ ప్లేయర్లకు కీలకంగా మారిన ఐపీఎల్ 2021...

First Published Aug 19, 2021, 11:17 AM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2పై ఇప్పుడు క్రికెట్ స్టార్లు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు జరిగే ఈ లీగ్‌లో ఆడేందుకు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, విండీస్ క్రికెటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిని పక్కనబెడితే కొందరు భారత క్రికెటర్లకు కూడా ఐపీఎల్ ఫేజ్ 2 కీలకం కానుంది...

శ్రేయాస్ అయ్యర్: ఫిబ్రవరిలో జరిగిన ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌లో గాయపడ్డాడు భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. అప్పటి నుంచి క్రికెట్‌ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వలేదు... గాయం కారణంగా ఐపీఎల్ 2021 ఫేజ్ 1కి దూరమయ్యాడు...

శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉండి ఉంటే, శ్రీలంకలో పర్యటించిన జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించేవాడు. అయితే అతను అప్పటికింకా కోలుకోకపోవడంతో ధావన్‌కి కెప్టెన్సీ దక్కింది...

శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో ఇంప్రెసివ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్, టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలన్నా, టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవాలన్నా... ఐపీఎల్ 2021 ఫేజ్ 2 పర్ఫామెన్స్ కీలకం కానుంది...

నటరాజన్: ఆరంగ్రేటం మ్యాచులోనే అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు భారత యార్కర్ కింగ్ నటరాజన్. ఆస్ట్రేలియా టూర్‌లో వన్డేలు, టీ20, టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన నట్టూ, ఆ తర్వాత గాయంతో బాధపడుతున్నాడు...

ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా, గాయం తిరగబెట్టడంతో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ ఒకే ఒక్క మ్యాచ్ ఆడగలిగాడు. ఇప్పుడు నట్టూకి కూడా ఐపీఎల్ పర్ఫామెన్స్ కీలకం కానుంది...

టీ20 వరల్డ్‌కప్ ఆడే జట్టులో నటరాజన్‌కి చోటు ఉండాలంటే... ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చి, మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఐదు మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్ రేసు నుంచి దూరమైన సన్‌రైజర్స్‌లో నట్టూ పర్ఫామెన్స్ ఏ రేంజ్ ఎఫెక్ట్ తీసుకొస్తుందో చూడాలి...

హార్ధిక్ పాండ్యా: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, కొన్నాళ్లుగా సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ ఫేజ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత శ్రీలంక సిరీస్‌లోనూ ఫెయిల్ అయ్యాడు...

అయితే ఈ పర్ఫామెన్స్ కారణంగా హార్ధిక్ పాండ్యాను పూర్తిగా పక్కనబెట్టే అవకాశం ఉండదు. అయితే తుదిజట్టులో హార్ధిక్ పాండ్యాకి చోటు ఉండాలంటే మాత్రం, తన రేంజ్ పర్ఫామెన్స్‌తో మరోసారి చూపించాల్సిందే...

ఇషాన్ కిషన్: ఎంట్రీతోనే అదరగొట్టిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కి నిలకడ లేమీ శాపంగా మారింది. ఒక మ్యాచ్‌లో అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లో విఫలమవుతూ వస్తున్నాడు ఇషాన్ కిషన్. ఐపీఎల్ ఫేజ్ 1లో మూడు మ్యాచుల్లో ఘోరంగా విఫలమై తుది జట్టులో చోటు కోల్పోయిన ఇషాన్ కిషన్, టీ20 వరల్డ్‌కప్ ఆడాలంటే మాత్రం అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే..

సూర్యకుమార్ యాదవ్: ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో చోటు దక్కించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న సూర్యకుమార్ యాదవ్, టీమ్‌లో ప్లేస్ ఫిక్స్ చేసుకోవాలంటే... శ్రేయాస్ అయ్యర్ విఫలం కావడంతో పాటు తాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలనని మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది.

భువనేశ్వర్ కుమార్: టీమిండియా స్టార్ బౌలర్‌గా ఉన్న భువనేశ్వర్ కుమార్, కొన్నాళ్లుగా తన రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో రాణించినా, శ్రీలంక పర్యటనలో ఆకట్టుకోలేకపోయాడు...

ఇప్పటికే దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్ వంటి బౌలర్ల నుంచి విపరీతమైన పోటీ ఎదుర్కొంటున్న భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాతో కలిసి తుదిజట్టులో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్ పర్ఫామెన్స్ కీలకం కానుంది...

నవ్‌దీప్ సైనీ: శ్రీలంక టూర్‌లో రెండో టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన పేసర్ నవ్‌దీప్ సైనీ, భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలంటే ఐపీఎల్ 2021 సీజన్‌లో రాణించి ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది...

శుబ్‌మన్ గిల్: టీమిండియా టెస్టు ఓపెనర్ శుబ్‌మన్ గిల్, గాయం కారణంగా ఇంగ్లాండ్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో లక్కీగా ఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇవ్వడంతో గిల్ స్థానం ప్రశ్నార్థకంలో పడింది...

స్టో బ్యాటింగ్ కారణంగా శుబ్‌మన్ గిల్, టీ20ల్లో స్థానం దక్కించుకోలేడు. వన్డేల్లో తీవ్రమైన పోటీ ఉంది. ఇక మిగిలిన టెస్టుల్లో అయినా తిరిగి స్థానం దక్కాలంటే శుబ్‌మన్ గిల్... మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది. 

click me!