లార్డ్స్ టెస్టు ఎఫెక్ట్, ఆ క్రికెటర్‌కి పిలుపు... మూడో టెస్టుకు అస్త్రాలు సిద్ధం చేస్తున్న ఇంగ్లాండ్...

First Published Aug 19, 2021, 9:31 AM IST

లార్డ్స్ టెస్టులో టీమిండియా చేతుల్లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ జట్టు... మూడో టెస్టు కోసం అస్త్రాలు సిద్ధం చేస్తోంది. టీ20ల్లో నెం.1 బ్యాట్స్‌మెన్‌గా ఉన్న డేవిడ్ మలాన్‌ను మూడో టెస్టులో బరిలో దింపాలని చూస్తోంది...

మొదటి టెస్టులో పరాజయం అంచుల దాకా వెళ్లి, వర్షం కారణంగా ఓటమి నుంచి తప్పించుకున్న ఇంగ్లాండ్... రెండో టెస్టులో మొయిన్ ఆలీని తీసుకొచ్చింది. అయితే అతను పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు...

మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఓ మాదిరిగా రాణిస్తున్నా... ఓపెనర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన రోరీ బర్న్స్, ఓ మాదిరిగా ఆకట్టుకున్నా... డామ్ సిబ్లీ మాత్రం టెస్టు సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు.

దీంతో డామ్ సిబ్లీ, తొలి టెస్టులో వన్‌డౌన్‌లో వచ్చిన జాక్ క్రావ్లీలను మూడో టెస్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ జట్టు. వీరిద్దరూ కౌంటీ టీమ్స్‌తో కలిసి ఆడబోతున్నారు... భారత జట్టుపై మంచి రికార్డు ఉన్న స్పిన్నర్ జాక్ లీచ్‌కి తుదిజట్టులో చోటు దక్కుతుందని ఆశించినా, ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీకి మాత్రమే చోటు దక్కింది..

మూడో టెస్టులో రోరీ బర్న్స్‌తో పాటు హసీబ్ హమీద్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. మూడో స్థానంలో డేవిడ్ మలాన్ బ్యాటింగ్‌కి రావచ్చు... టూ డౌన్‌లో జో రూట్ బరిలో దిగుతాడు...

రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన మార్క్ వుడ్... మూడో టెస్టు సమయానికి కోలుకుంటాడని ఇంగ్లాండ్ జట్టు ఆశాభావం వ్యక్తం చేసింది. ఒకవేళ మార్క్ వుడ్ కోలుకోకపోతే అతని స్థానంలో సాదిక్ మహమూద్, ఓవర్టన్‌లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది...

‘మూడో టెస్టు సమయానికి మార్క్ వుడ్ కోలుకుంటాడని ఆశిస్తున్నాం. మా మెడికల్ టీమ్, అతని గాయాన్ని నిత్యం పర్యవేక్షిస్తోంది. అతను ఫిట్‌గా లేకపోతే సాదిక్ ఆడతాడు... లేదా ఓవర్టన్ ఆరంగ్రేటం చేస్తాడు...’ అంటూ తెలిపాడు ఇంగ్లాండ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్...

‘డేవిడ్ మలాన్‌, ఈ అవకాశానికి నూటికి నూరుశాతం అర్హుడు. అతనికి అన్ని ఫార్మాట్లలో మంచి అనుభవం ఉంది. తన సొంత మైదానంలో మలాన్, అద్భుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నా... ’ అంటూ తెలిపాడు క్రిస్ సిల్వర్‌వుడ్...

తన కెరీర్‌లో 15 టెస్టులు ఆడిన డేవిడ్ మలాన్, ఓ సెంచరీ, 6 హాఫ్ సెంచరీలతో 724 పరుగులు చేశాడు. చివరిగా 2018లో ఇండియాపైనే టెస్టు ఆడిన డేవిడ్ మలాన్, ఆ తర్వాత ఈ ఫార్మాట్‌లో చోటు కోల్పోయాడు..

మూడో టెస్టుకి ఇంగ్లాండ్ జట్టు ఇది: జో రూట్ (కెప్టెన్), రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జానీ బెయిర్‌స్టో, జోష్ బట్లర్, ఓల్లీ పోప్, ఓల్లీ రాబిన్‌సన్, జేమ్స్ అండర్సన్, సామ్ కుర్రాన్, డాన్ లారెన్స్, సాదిక్ మహమూద్, మొయిన్ ఆలీ, ఓవర్టన్, మార్క్ వుడ్. 

click me!