ముంబై ఇండియన్స్ జట్టు తరుపున అద్భుతంగా రాణిస్తున్నాడు బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్. 8 సీజన్లుగా ఐపిఎల్ ఆడుతున్నా, మంచి ప్రదర్శన ఇస్తున్నా సూర్యకుమార్ యాదవ్‌కి భారత జట్టులో చోటు దక్కడం లేదు. దీనిపై సూర్యకుమార్ యాదవ్ బహిరంగంగానే తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఈ సీజన్‌లో 12 మ్యాచుల్లో 31.44 సగటుతో 283 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. రెండు హాఫ్ సెంచరీలు కూడా బాదిన సూర్యకుమార్ యాదవ్ స్ట్రైయిక్ రేటు 148కి పైనే ఉంది.
ఈ ప్రదర్శనతో సూర్యకుమార్ యాదవ్‌కి భారత జట్టులో తప్పకుండా చోటు దక్కుతుందని భావించారంతా. కానీ మరోసారియాదవ్‌కి మొండిచేయి చూపించారు సెలక్టర్లు.
అలాగే ఐదు సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కూడా ఈ సీజన్‌లో మరోసారి మెరిసాడు. 10 మ్యాచులు ఆడి 298 పరుగులు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 99 పరుగుల ఇన్నింగ్స్ కారణంగానే మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కి దారి తీసింది. అలాంటి అద్భుత ఇన్నింగ్స్ ఆడగల ఈ లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్‌కి అవకాశం ఇవ్వలేదు సెలక్టర్లు.
ఇషాన్ కిషన్ కంటే నిలకడలేమి సమస్యతో సతమతమవుతున్న సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లకు భారత జట్టులో చోటు కల్పించారు సెలక్టర్లు... ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కంటే రిషబ్ పంత్ చేసిన పరుగులు, స్ట్రైయిక్ రేటు కూడా తక్కువే.
ఈ ఇద్దరూ ముంబై ఇండియన్స్ జట్టుకి ఆడడం వల్లే వారికి భారత జట్టులో అవకాశం రావడం లేదని అనుమానిస్తున్నారు రోహిత్ శర్మ అభిమానులు. ఫిట్‌నెస్ లేదనే నెపంతో రోహిత్ శర్మను ఆసీస్ టూర్‌కి దూరంగా పెట్టిన సెలక్టర్లు, ముంబై యంగ్ ప్లేయర్లకి కూడా మరోసారి మొండిచేయి చూపించారని ఆరోపిస్తున్నారు.
అయితే ఆస్ట్రేలియాలోని పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని సెటిల్ అయ్యేందకు సమయం పడుతుందని... తొలిసారి భారత జట్టుకు ఆడే ప్లేయర్లు ఆ ఒత్తిడిని తట్టుకోలేరని... అందుకే ఆసీస్ టూర్‌కి ఎంతో కొంత అనుభవం ఉన్న ప్లేయర్లను ఎంపిక చేశారని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఈ సమాధానంతో ఏ మాత్రం సంతృప్తి చెందడం లేదు అభిమానులు. ఎందుకంటే ఒకేఒక్క మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడని యంగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి టీ20 జట్టులో అవకాశం ఇచ్చిన సెలక్టర్లు, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లను ఎందుకు పక్కనబెట్టారని నిలదీస్తున్నారు.
ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టుతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఉన్న మనస్ఫర్థలు మరోసారి బయటపడ్డాయని అంటున్నారు నెటిజన్లు.