గిల్, అర్ష్‌దీప్ పై వేటు తప్పదా..? మూడో టీ20లో మార్పులతో బరిలోకి టీమిండియా..

First Published Jan 6, 2023, 7:56 PM IST

INDvsSL: స్వదేశంలో లంకతో జరుగుతున్న  మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి టీ20 గెలిచిన భారత జట్టు.. రెండో టీ20లో విజయానికి దగ్గరగా వచ్చినా ఓటమి తప్పలేదు. సిరీస్ కు కీలకంగా మారిన మూడో మ్యాచ్ లో  పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. 

శ్రీలంకతో  తొలి మ్యాచ్ లో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు గెలిచిన యువ భారత్.. రెండో మ్యాచ్ లో పోరాడి ఓడింది. అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ లు భారత్ ను  విజయతీరాలకు చేర్చినా చివర్లో తడబడి ఓటమిని మూటగట్టుకుంది. 

సిరీస్ డిసైడర్ గా మారిన మూడో మ్యాచ్ లో మాత్రం టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.  రాక రాక టీ20లలోకి వచ్చిన శుభమన్ గిల్ రెండు మ్యాచ్ లలోనూ విఫలమయ్యాడు. దీంతో అతడికి  మూడో మ్యాచ్ లో చోటు దక్కడం కష్టమే అనిపిస్తోంది. 

గిల్ స్థానంలో దేశవాళీలో అదరగొట్టిన  రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశం దక్కొచ్చు.  ఒకవేళ  గైక్వాడ్ కు తుది జట్టులో చోటిస్తే ఇషాన్ తో  కలిసి అతడే ఓపెనర్ గా వస్తాడు.   ఇక తొలి మ్యాచ్ లో సంజూ శాంసన్ గాయపడటంతో  13 మ్యాచ్ లు బెంచ్ మీద ఉండి చివరికి రెండో మ్యాచ్ లో చోటు దక్కించుకున్న  రాహుల్ త్రిపాఠిని కొనసాగించే అవకాశముంది. బ్యాటింగ్ విభాగంలో ఇంతకంటే మార్పులు చేయకపోవచ్చు. 

కానీ బౌలింగ్ లో మాత్రం  గత మ్యాచ్ లో నోబాల్స్ తో పాటు  మ్యాచ్ ఓటమికి పరోక్ష కారణమైన లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్  పై వేటు తప్పేలా లేదు.  రెండు ఓవర్లు వేసి ఐదు నోబాల్స్ వేయడమే గాక  దారాళంగా పరుగులిచ్చిన ఇతడిపై వేటు ఖాయమే అనిపిస్తోంది. 

అర్ష్‌దీప్ ను తప్పించి అతడి స్థానంలో  ముఖేష్ కుమార్ ను ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది.  ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావిలు  తొలి మ్యాచ్ లో రాణించి రెండో మ్యాచ్ లో ఫర్వాలేదనిపించారు. వీరిని తొలగించే సాహసం టీమిండియా చేయకపోవచ్చు. 

మరోవైపు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను కూడా మూడో మ్యాచ్ కు పక్కనబెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. అతడి స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. తొలి రెండు మ్యాచ్ లలో రాణించిన అక్షర్ పటేల్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.  ఎటొచ్చి  గిల్, అర్ష్‌దీప్, చాహల్ లపై  వేటు తప్పేలా లేదు. 

మూడో మ్యాచ్ కు భారత జట్టు (అంచనా) : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి,  ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్

click me!