నిన్ను తీసుకున్నా బాగుండు.. అనవసరంగా మిస్ అయ్యాం.. లంక సారథిని వేలంలో కొనుగోలు చేయకపోవడంపై ఫ్రాంచైజీల విచారం?

First Published Jan 6, 2023, 6:45 PM IST

IPL 2023: భారత పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టును సమర్థవంతంగా నడిపించడంలో ఆ జట్టు సారథి  దసున్ శనక  సక్సెస్ అవుతున్నాడు.  మొదటి మ్యాచ్ లో  లంకను విజయానికి చేరువ చేసిన అతడు రెండో మ్యాచ్ లో భారీ హిట్టింగ్ కు దిగాడు. 

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో  కోటానుకోట్ల రూపాయలు ఖర్చు చేసి పలువురు ఆటగాళ్లను దక్కించుకున్న ఫ్రాంచైజీలు.. ఇండియా - శ్రీలంక మధ్య   జరుగుతున్న టీ20 సిరీస్ లో లంక సారథి  దసున్ శనక ఆట చూసిన తర్వాత.. ‘ఇతడిని మనం దక్కించుకుంటే బాగుండు.. తప్పు చేశాం..’ అని విచారం వ్యక్తం చేస్తున్నాయట.. 

కొచ్చి వేదికగా డిసెంబర్ లో ముగిసిన వేలంలో  అందరిలాగే  శనక కూడా   తన పేరు నమోదు చేసుకున్నాడు. అతడి బేస్ ప్రైస్ రూ. 50 లక్షలుగా ఉంది.  అయితే వేలంలో అతడి గురించి ఎవరూ పట్టించుకోలేదు.  కనీసం అతడిని తీసుకోవడానికి కూడా ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. 

అయితే  భారత్ తో సిరీస్ లో శనక రెచ్చిపోతున్నాడు. ముంబైలో జరిగిన తొలి మ్యాచ్ లో  45 పరుగులు చేసిన అతడు రెండో టీ20లో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇందులో రెండు ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లు ఉన్నాయి. నిన్నటి మ్యాచ్ లో లంక భారీ స్కోరు చేయడానికి  బాటలు వేసింది  శనకనే. అతడి మెరుపులతో  లంక.. ఈ మ్యాచ్ లో విజయాన్ని అందుకున్నది.  

భారత్ పై శనకకు టీ20లలో మంచి రికార్డు ఉంది.  గడిచిన ఐదు మ్యాచ్ లలో అతడు..  56, 45, 33 నాటౌట్, 74 నాటౌట్, 47  పరుగులు చేశాడు.  భారత్ పై టీ20లలో 400 కు పైగా పరుగులు చేసిన తొలి శ్రీలంక క్రికెటర్ అతడే.    భారత్ తోనే గాక ఇతర దేశాలపైనా  శనక  దీటుగా ఆడతాడు. గతేడాది శ్రీలంక ఆసియా కప్ గెలవడంలో శనక ఆ జట్టును నడిపించిన విధానం అందరినీ ఆకట్టుకుంది.   

పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో శనకకు మంచి అనుభవముంది.  వికెట్లు పడుతుంటే  నెమ్మదిగా ఆడి చివర్లో భారీ హిట్టింగ్ కు దిగడంలో   అతడు దిట్ట.  అదీగాక  కెప్టెన్ గా కూడా శనక  వ్యూహ రచన  విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  అతడు బ్యాట్ తో పాటు మీడియం పేసర్ కూడా.  ఇన్ని లక్షణాలు ఉన్న  నాణ్యమైన ఆల్ రౌండర్ ను వదులుకున్న ఫ్రాంచైజీలు తెగ ఫీలయిపోతున్నాయని తెలుస్తున్నది. 

ముఖ్యంగా  ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథి లేడు.  కేన్ విలియమ్సన్ ఖాళీ చేసిన ఆ స్థానాన్ని  భర్తీ చేయడానికి ఆ జట్టు వేట సాగిస్తున్నది. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్.. శనకను  కొనుగోలు చేసుంటే బాగుండేదని  ఆ ఫ్రాంచైజీ  వర్గాలు చెప్పుకుంటున్నాయి. బ్రూక్ కోసం  రూ. 13 లక్షలు వెచ్చించిన సన్ రైజర్స్.. శనక కోసం  రూ. 50 లక్షలు పెడితే నాణ్యమైన ఆల్ రౌండర్ దొరికేవాడని  అనుకుంటున్నాయి. 

click me!