గాయంతో ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వని కపిల్ దేవ్... 16 ఏళ్ల కెరీర్ తర్వాత కూడా పొమ్మనేదాకా...

First Published Jan 6, 2023, 5:36 PM IST

కపిల్ దేవ్... టీమిండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్ డాగ్స్‌గా 1983 వన్డే వరల్డ్ కప్‌లో బరిలో దిగిన భారత జట్టు, అరవీర భయంకర ఫామ్‌లో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ని ఓడించి టైటిల్ సాధించింది. ఈ విజయం భారత క్రికెట్ గతినే మార్చేసింది...

1978లో పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన కపిల్ దేవ్, కెప్టెన్‌గా 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచాడు. అతి పిన్న వయసులో వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్‌గా కపిల్ రికార్డు ఇంకా చెక్కుచెదరకుండా ఉంది. భారత క్రికెట్ దశను మార్చిన 1983 వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత కపిల్ దేవ్ స్టార్‌గా మారిపోయాడు...

131 టెస్టులు, 225 వన్డేలు ఆడిన కపిల్‌ దేవ్, రికార్డు స్థాయిలో టెస్టుల్లో 434 వికెట్లు, వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన కపిల్ దేవ్, టెస్టుల్లో 5248 పరుగులు, వన్డేల్లో 3783 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు కూడా ఉన్నాయి..

నేటి క్రికెట్‌లో గాయాల గురించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ,జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలతో టీమ్‌‌కి దూరమవుతున్నారు. ఆఖరికి ఫిట్‌నెస్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ కూడా తన కెరీర్‌లో ఐదు సార్లు గాయాలతో జట్టుకి దూరమయ్యాడు...

అయితే 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కపిల్ దేవ్ ఏ మ్యాచ్ కూడా గాయం వంకతో తప్పుకున్నది లేదు. తన కెరీర్‌లో 131 టెస్టులు ఆడిన కపిల్ దేవ్, ఆ టైమ్‌లో భారత జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్‌కి అందుబాటులో ఉన్నాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ కూడా గాయాలతో మ్యాచులకు దూరమయ్యారు. అయితే కపిల్ మాత్రం మొండిగా పూర్తి ఫిట్‌నెస్‌తో కెరీర్‌ని కొనసాగించాడు...

వాస్తవానికి కపిల్ దేవ్ కెరీర్‌కి దక్కాల్సిన ముగింపు దక్కలేదు. కెరీర్ చివర్లో సెలక్టర్లు, భారత క్రికెట్ బోర్డు సభ్యులు కలిసి రిటైర్ అవ్వమని స్వయంగా వెళ్లి కపిల్‌దేవ్‌కి చెప్పాల్సి వచ్చింది. 

1991-92 ఆస్ట్రేలియా పర్యటనలో 400 వికెట్లు పూర్తి చేసుకున్న కపిల్ దేవ్, ఆ తర్వాత 31 వికెట్లు పడగొట్టేందుకు దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నాడు. చివరికి అహ్మదాబాద్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తిలకరత్నేని అవుట్ చేసి, రిచర్డ్ హార్డ్‌లీ రికార్డును బ్రేక్ చేశాడు కపిల్ దేవ్...

ఈ రికార్డు బ్రేక్ చేసిన తర్వాత కపిల్ దేవ్ రిటైర్మెంట్ తీసుకుంటాడని అనుకున్నారు చాలామంది. అయితే అప్పటికి కూడా కపిల్ దేవ్ దాహం తీరలేదు...

తాను మరికొన్నాళ్లు క్రికెట్‌లో కొనసాగుతానని ప్రకటించడంతో బీసీసీఐ సెలక్టర్లు వెళ్లి ఇక రిటైర్ అవ్వాల్సిందిగా కోరారు. దీంతో కపిల్, ఇష్టం లేకపోయినా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు..

click me!