టీమిండియా బౌలర్ల ధాటికి వన్డేలలో కివీస్ చెత్త రికార్డు..

First Published Jan 21, 2023, 5:11 PM IST

INDvsNZ Live Socre: రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న  రెండో వన్డేలో భారత బౌలర్ల ధాటికి కివీస్  చెత్త రికార్డు నమోదు చేసింది. 

భారత్ తో జరుగుతున్న  వన్డే సిరీస్ లో తప్పనిసరిగా  నెగ్గాల్సిన మ్యాచ్ లో కివీస్ తడబడింది.  హైదరాబాద్ లో ముగిసిన తొలి వన్డేలో  130కే ఆరు వికెట్లు కోల్పోయినా   మ్యాచ్ లో దాదాపు గెలిచినంత పనిచేసిన  న్యూజిలాండ్.. రాయ్‌పూర్ లో మాత్రం  ఆ  పోరాటపటిమను చూపించలేకపోయింది. 

ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్.. 34.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ .. 36 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.   తొలి వన్డేలో మెరుపులు మెరిపించిన  బ్రేస్‌వెల్ (22), సాంట్నర్ (27) ఈసారి విఫలమయ్యారు. 

అయితే ఈ మ్యాచ్ లో  తొలుత  కివీస్ బ్యాటింగ్ చూస్తే అసలు ఈ టీమ్  50 పరుగులైనా చేయగలుగుతుందా..? అన్న అనుమానం కలగకమానదు.  10 ఓవర్లలోనే ఆ జట్టు పదిహేను పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.  ఈ క్రమంలో కివీస్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 

న్యూజిలాండ్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇంత తక్కువ స్కోరుకే  ఐదు వికెట్లు కోల్పోవడం ఆ జట్టుకు ఇదే ప్రథమం.  గతంలో  కివీస్.. శ్రీలంకతో  2001లో  మ్యాచ్ ఆడుతూ.. 18 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది.   ఆ తర్వాత బంగ్లాదేశ్ మీద.. 2010లో 20 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకుంది.   2003లో ఆస్ట్రేలియా పైనా 21 రన్స్ కే  సగం మంది బ్యాటర్లు పెవిలియన్ చేరారు. 

ఇక భారత్ తో మ్యాచ్ ఆడుతూ ఒక ప్రత్యర్థి 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం  ఇదే ప్రథమం.  గతంలో ఇంగ్లాండ్.. గతేడాది ఓవల్ లో మ్యాచ్ ఆడుతూ 26 పరుగులేకే ఐదు వికెట్లు  కోల్పోయింది.  అంతకుముందు 1997లో  పాకిస్తాన్ (29-5) , 2005లో జింబాబ్వే (30-5) కూడా ఇటువంటి ప్రదర్శనలే నమోదు చేశాయి. 

కాగా భారత బౌలర్లలో షమీకి 3 వికెట్లు దక్కగా, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ కు తలా రెండు వికెట్లు పడ్డాయి.  సిరాజ్, శార్దూల్, కుల్దీప్ చెరో వికెట్ తీసి కివీస్ నడ్డి విరిచారు.  

click me!