విరాట్ కోహ్లీ లేడు! టైమ్ బాలేదు... వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ని పట్టించుకోని వ్యూయర్స్...

First Published Aug 4, 2022, 5:28 PM IST

ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత వన్డే, టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్‌లో అడుగుపెట్టింది భారత జట్టు. వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, టీ20 సిరీస్‌లోనూ 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచులు వ్యూయర్‌షిప్ రాబట్టడానికి తెగ కష్టపడుతున్నాయట...

వెస్టిండీస్‌ కాలమానం, భారత కాలమానానికి చాలా తేడాలు ఉన్నాయి. అక్కడ ఉదయం 10:30 గంటలకు టీ20 మ్యాచ్ ప్రారంభమైతే, ఇక్కడ అది రాత్రి 8 గంటలు. అయితే వివిధ కారణాలతో రెండో టీ20 రాత్రి 11 గంటలకు, మూడో టీ20 రాత్రి 9:30 గంటలకు ప్రారంభమయ్యాయి...

అదీకాకుండా ఈ సిరీస్‌కి విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ బరిలో దిగకపోవడంతో చాలా మంది ఈ మ్యాచులను పట్టించుకోవడమే మానేశారు...

అదీకాకుండా వెస్టిండీస్‌లో జరుగుతున్న ఈ మ్యాచులకు సంబంధించిన ప్రత్యేక్ష ప్రసారాలు డీడీ స్పోర్ట్స్‌లో వస్తున్నాయి. 480 పిక్సెల్‌లో పాత ఈస్ట్‌మన్ కలర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వచ్చే దూరదర్శన్‌లో మ్యాచులను చూడడానికి చాలామంది ఇష్టపడడం లేదు...

స్టార్ నెట్‌వర్క్, సోనీ నెట్‌వర్క్ వంటి ఛానెల్స్‌లో ప్రత్యేక్ష ప్రసారాలు రాకపోవడం, మొబైల్ యాప్ కూడా ఏదీ అందుబాటులో లేకపోవడం... ఇండియా- వెస్టిండీస్ మ్యాచులకు వ్యూయర్‌షిప్ రాకపోవడానికి కారణంగా మారింది...

ఈ సిరీస్‌ని ఫ్యాన్ కోడ్ ఛానెల్ ప్రత్యేక్ష ప్రసారం చేస్తోంది. ఈ ఛానెల్‌కి విదేశాల్లో మంచి ప్రాచుర్యం ఉన్నా, ఇక్కడ దీన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కేవలం వెస్టిండీస్ సిరీస్ మ్యాచులు చూసేందుకు ఫ్యాన్ ‌కోడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు...

అంతేకాకుండా ఆండ్రే రస్సెల్, క్రిస్ గేల్ వంటి విండీస్ స్టార్ ప్లేయర్లు లేక బలహీనంగా కనిపిస్తున్న వెస్టిండీస్‌, స్వదేశంలో టీమిండియాకి ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది... ఇప్పుడు అక్కడ జరుగుతున్న మ్యాచులను కూడా జనాలు తేలిగ్గా తీసుకున్నారు...

థియేటర్లకు పోయి సినిమా చూసేందుకు కూడా ఇష్టపడని అవుట్ ఆఫ్ సీజన్‌లో జరుగుతున్న మ్యాచులు కావడంతో ఈ మ్యాచుల వ్యూయర్‌షిప్ రాబట్టలేకపోతున్నాయని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. 

Suryakumar Yadav

మొత్తానికి పాండవులకు అగ్రజుడైనా కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలన్నట్టు... వెస్టిండీస్‌తో సిరీస్‌కి వ్యూయర్‌షిప్‌ రాకపోవడానికి కూడా బోలెడు కారణాలున్నాయనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో సిరీస్‌నే జనాలు పట్టించుకోకపోతే తర్వాత జింబాబ్వేతో జరిగే సిరీస్‌ని పట్టించుకుంటారా? అనేది ఇప్పుడు ప్రశ్న...

click me!