ఆ ముగ్గురూ సరే, శిఖర్ ధావన్ పరిస్థితి ఏంటి? గబ్బర్‌కి వన్డేల్లో అయినా ప్లేస్ ఉంటుందా...

First Published Dec 12, 2021, 4:57 PM IST

శిఖర్ ధావన్... ఒకానొక దశలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పోటీ పడి పరుగులు చేసిన స్టార్ బ్యాట్స్‌మెన్. అయితే ఈ మధ్య గబ్బర్ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఇప్పుడు సౌతాఫ్రికా టూర్‌లో అయినా శిఖర్ ధావన్‌కి చోటు దక్కుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది...

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో శిఖర్ ధావన్‌కి వరుసగా అవకాశాలు కల్పిస్తూ, గబ్బర్‌కి పూర్తి సపోర్ట్ ఇచ్చేవాడు. అయితే ఇప్పుడు ధావన్ ఫామ్ ఏ మాత్రం సరిగా లేదు...

టెస్టు ఆరంగ్రేటంలోనే భారీ శతకం నమోదు చేసిన శిఖర్ ధావన్, టీ20ల్లోనూ రోహిత్ శర్మతో కలిపి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. రోహిత్ ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో గబ్బర్ పరుగుల వరద పారించేవాడు...

ఐపీఎల్‌లో గత మూడు సీజన్లలో అదరగొట్టినా, టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీకి ప్రకటించిన జట్టులో శిఖర్ ధావన్‌ను చోటు కల్పించలేదు సెలక్టర్లు...

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో కూడా శిఖర్ ధావన్‌ను తప్పించాలని సెలక్టర్లు భావించినా, విరాట్ కోహ్లీ కచ్ఛితంగా గబ్బర్‌ను ఆడించాలని పట్టుబట్టాడని సమాచారం...

ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన రికార్డు ఉన్న శిఖర్ ధావన్‌ను టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆడించి ఉంటే, ఫలితం వేరేగా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు, అభిమానుల అంచనా...

శ్రేయాస్ అయ్యర్ గాయపడడం, భారత జట్టు ఇంగ్లాండ్ టూర్‌లో ఉండడంతో శ్రీలంక టూర్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు శిఖర్ ధావన్...

అయితే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో బ్యాట్స్‌మెన్‌గా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు శిఖర్ ధావన్. మొదటి రెండు వన్డేల్లో 14, 12 పరుగులు చేసిన గబ్బర్, మూడో వన్డేలో డకౌట్ అయ్యాడు...

శిఖర్ ధావన్ ఫామ్‌కి తోడు కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్,వెంకటేశ్ అయ్యర్ రూపంలో ఓపెనర్ స్థానం కోసం పోటీ విపరీతంగా పెరిగిపోయింది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్, ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీల్లో శతకాల మోత మోగిస్తున్నాడు...

వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతుండడంతో పాటు పృథ్వీషా కూడా ఓపెనర్ ప్లేస్‌కి పోటీ వచ్చే అవకాశం ఉంది. సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న మ్యాచుల్లో ఆకట్టుకున్న పృథ్వీ షాకి సెలక్టర్లు పిలుపు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు...

వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్న రోహిత్ శర్మ, సీనియర్ శిఖర్ ధావన్ కంటే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని దృష్టిలో పెట్టుకుని కెఎల్ రాహుల్‌ని ఓపెనర్‌గా ఆడించడానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చు...

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించని రోహిత్ శర్మ, విజయ్ హాజారే ట్రోఫీ పర్ఫామెన్స్ కారణంగా సౌతాఫ్రికా టూర్‌లో అతనికి అవకాశం ఇస్తాడా? అనేది అనుమానమే...

click me!