వాళ్లు అలా, మనోళ్లు ఇలా... చేతుల్లోకి వచ్చిన క్యాచులు కూడా పట్టలేవా పూజారా...

First Published Jan 14, 2022, 4:15 PM IST

30 ఏళ్లుగా సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవలేకపోయిన భారత జట్టు, ఈ సారి ఆ లోటు తీర్చుకోవాలనే కసితో సఫారీ గడ్డపై అడుగుపెట్టింది. మొదటి టెస్టులో గెలిచినా, రెండో టెస్టులో ఓడిన భారత జట్టు... మూడో టెస్టులోనూ ఓటమి అంచున నిలిచింది...

ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలం కావడం టీమిండియా పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపించింది...

కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత మిడిల్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ మినహా ఎవ్వరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు...

రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ అజేయ సెంచరీతో ఆకట్టుకున్నా, మిగిలిన 10 మంది ప్లేయర్లు కలిసి 100 పరుగులు చేయలేకపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...

బ్యాటింగ్ విషయం పక్కనబెడితే ఫీల్డింగ్‌లోనూ ఛతేశ్వర్ పూజారా చేసిన తప్పులకు భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది...

అయిడిన్ మార్క్‌రమ్ అవుటైన తర్వాతి బంతికే కీగన్ పీటర్సన్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసి పట్టలేకపోయాడు ఛతేశ్వర్ పూజారా...

పూజారాకి కొంచెం ముందు బంతి పడింది. అలాంటి సమయంలో జడేజా, కోహ్లీ, మయాంక్, కెఎల్ రాహుల్ వంటి ఫీల్డర్లు ఉంటే... డైవ్ చేసి క్యాచ్ అందుకునేవారే. కానీ పూజారా డైవ్ చేస్తే, ఎక్కడ గాయమవుతుందో అనే ఆలోచించేలోపు బంతి కిందపడింది...

ఆ తర్వాత సౌతాఫ్రికా స్కోరు 126/2 వద్ద ఉన్నప్పుడు కీగన్ పీటర్సన్ ఇచ్చిన క్యాచ్‌ను మరోసారి నేలపాలు చేశాడు ఛతేశ్వర్ పూజారా...

జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో పీటర్సన్ బ్యాట్ అంచును ముద్దాడిన బంతి, నేరుగా పూజారా చేతుల్లో వెళ్లి పడింది. అయితే పూజారా దాన్ని అందుకోలేకపోయాడు...

క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత పూజారా చిరునవ్వులు చిందడం, సగటు క్రికెట్ అభిమానిని మరింత ఆగ్రహానికి గురి చేసింది. అప్పటికి సౌతాఫ్రికా విజయానికి ఇంకా 83 పరుగుల దూరంలో ఉంది...

లైఫ్ దొరకడంతో దాన్ని సరిగ్గా వాడుకున్న కీగన్ పీటర్సన్... దూకుడు పెంచి మ్యాచ్ విన్నింగ్స్ ఆడాడు. 113 బంతుల్లో 10 ఫోర్లతో 82 పరుగులు చేసి... భారత జట్టుకు విజయాన్ని దూరం చేశాడు... 

పూజారా కీలక మ్యాచుల్లో ఇలా క్యాచులు డ్రాప్‌ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లోనూ రాస్ టేలర్ ఇచ్చిన క్యాచ్‌ను ఇలాగే జారవిడిచాడు పూజారా...

అనుభవం ఉంది కదా అని బ్యాటుతో రాణించకపోయినా వరుస అవకాశాలు ఇస్తూ ఛతేశ్వర్ పూజారాని ప్రోత్సాహించడం వల్ల టీమిండియాకి పెద్ద నష్టమే జరుగుతోందని అంటున్నారు అభిమానులు...

సౌతాఫ్రికా ప్లేయర్లు ఫీల్డింగ్‌లో మెరుపులా కదిలారు. గాల్లోకి ఎగురుతూ, డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచులు అందుకున్నారు. టీమిండియా నుంచి మాత్రం అలాంటి ఎఫర్ట్స్ చూడకపోగా, క్యాచ్ డ్రాపులు చూడాల్సి వచ్చిందని వాపోతున్నారు భారత అభిమానులు...

click me!