
India vs Pakistan Pitch Report: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జరిగే ఐదో మ్యాచ్ లో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ఫిబ్రవరి 23, ఆదివారం జరిగే ఈ మ్యాచ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు వేస్తారు. ఈ మ్యాచ్ పాకిస్తాన్ కు డూ ఆర్ డై లాంటింది. ఓడితే పాక్ టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. ఇక భారత్ గెలిస్తే సెమీస్ కు చేరుకుంటుంది. మ్యాచ్ జరిగే దుబాయ్ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్టు, ఇక్కడ భారత్, పాకిస్తాన్ రికార్డుల వివరాలు గమనిస్తే..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పిచ్ రిపోర్టు
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని పిచ్ సాధారణంగా స్లో ట్రాక్‌లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. ఈ పిచ్‌పై కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్ల పనిభారం కూడా పెరుగుతుంది. అంటే మొత్తంగా దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు ఆరంభంలోనే వికెట్లు తీసుకుంటే వారిపై భారం తగ్గుతుంది.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రోజు వాతావరణం ఎలా ఉంటుంది?
ఫిబ్రవరి 23న దుబాయ్‌లో వాతావరణం సాధారణంగా ఉంటుంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం లేదు. కాబట్టి మ్యాచ్ కు ఎక్కడ అంతరాయం కలిగే అవకాశం వుండదు. అభిమానులు మొత్తం మ్యాచ్‌ను చూడవచ్చు. ఆదివారం దుబాయ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తేలికపాటి మేఘాలు కూడా ఉండవచ్చు. గంటకు 30 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. సాయంత్రం వేళల్లో తేలికపాటి మంచు కురవవచ్చు. కాబట్టి ఇది కూడా మ్యాచ్ పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో ఏ బౌలర్లు ప్రభావం చూపే ఛాన్స్ ఉంది?
దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి భారత పేసర్లు మ్యాచ్ ప్రారంభంలో ఉన్న పిచ్‌ను మహమ్మద్ షమీ, హర్షిత్ రాణాలు ఉపయోగించుకుంటే త్వరగానే వికెట్లు దక్కుతాయి. ఇక తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్‌పై షమీ 5 వికెట్లు, రాణా 3 వికెట్లు పడగొట్టి మంచి ఫామ్ లో ఉన్నారు. వీరికి తోడుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో భారత స్పిన్ విభాగం బలంగానే ఉంది.
ఇక పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ చేస్తే నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌస్ పిచ్ అందించే పూర్తి ప్రయోజనాన్ని పొందే ఛాన్స్ వుంటుంది. కాబట్టి రెండు జట్ల మధ్య టాస్ కీలకంగా మారనుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు రంగంలోకి దిగుతారు.పాకిస్తాన్ అబ్రార్ అహ్మద్ కాకుండా ఖుష్దిల్ షాపై ఆధారపడుతుంది.
దుబాయ్ లో భారత్-పాకిస్తాన్ వన్డే రికార్డులు ఎలా ఉన్నాయి?
యూఏఈలో భారత్, పాకిస్తాన్ జట్లు 28 సార్లు వన్డేల్లో తలపడ్డాయి, ఇందులో భారత జట్టు 9 సార్లు విజేత నిలిచింది. పాకిస్తాన్ 19 మ్యాచ్ లలో విజయం సాధించింది. అంటే వన్డే క్రికెట్ లో దుబాయ్ లో పాకిస్తాన్ కు భారత్ పై మంచి రికార్డులు ఉన్నాయి.
భారత్ - పాకిస్థాన్ మధ్య తొలి వన్డే 1978లో జరిగింది. మొత్తంగా ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు వన్డేల్లో 135 సార్లు తలపడ్డాయి. ప్రస్తుతానికి మొత్తం వన్డేల్లో హెడ్-టు-హెడ్ రికార్డులో పాకిస్తాన్ పై చేయిగా ఉంది. వీటిలో 73 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ గెలవగా, భారత్ 57 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రెండు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచుల్లో ఫలితం రాలేదు. అయితే, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన చివరి 10 మ్యాచ్ లలో టీమిండియాదే పైచేయిగా ఉంది. చివరి 10 మ్యాచ్ లలో 7 మ్యాచ్ లను భారత్ గెలుచుకుంది. రెండు పాకిస్తాన్ గెలుచుకోగా, ఒకటి ఫలితం రాలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్-పాకిస్తాన్ జట్లు:
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్.
పాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాన్, కమ్రాన్ గులాం, ఫహీమ్ అష్రఫ్.