రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ... వారి విషయంలో టీమిండియాకి కలిసిరాని ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా...

First Published Nov 17, 2021, 6:42 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు ప్రదర్శన, అభిమానుల్లో కొత్త కొత్త సందేహాలను లేవనెత్తుతోంది. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో భారత పురుషుల జట్టు కూడా, మహిళల జట్టులాగే ఇద్దరు కెప్టెన్ల ఫార్ములాని అవలంభించబోతోంది...

ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి ఎన్నో జట్లకి ఇప్పుడు టెస్టుల్లో ఒకరు, పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒకరంటూ ఇద్దరేసి కెప్టెన్లు ఉన్నారు...

ఇంగ్లాండ్‌కి టెస్టుల్లో జో రూట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, వన్డే, టీ20ల్లో ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియాకి టెస్టుల్లో టిమ్ పైన్ కెప్టెన్‌గా ఉంటే, వన్డే, టీ20ల్లో ఆరోన్ ఫించ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.

అయితే టీమిండియా విషయంలో కూడా ఈ ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా కొత్తేమీ కాదు. ఎమ్మెస్ ధోనీ వన్డే, టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్నప్పుడు అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్లేయర్లు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించారు...

ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుని, సుదీర్ఘ ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ప్రకటిస్తే... విరాట్ కోహ్లీ టెస్టుల్లో, ఎమ్మెస్ ధోనీ టీ20, వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించేవాడు...

అయితే అనిల్ కుంబ్లే టెస్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు, అతనికి వన్డే, టీ20ల్లో ప్లేస్ లేదు. అలాగే ఎమ్మెస్ ధోనీ టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంతో విరాట్ కోహ్లీ పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.

అయితే విరాట్ కోహ్లీ విషయంలో అలా కాదు. అతను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా వన్డే, టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. మూడు ఫార్మాట్లలో ప్లేయర్‌గా కొనసాగబోతున్నాడు...

దీంతో ప్లేయర్లలో కొత్త కంఫ్యూజన్ కూడా రావచ్చు. టీ20ల్లో విజయాలు వచ్చి, వన్డే, టెస్టుల్లో పరాజయాలు ఎదురైతే... అక్కడ కూడా రోహిత్‌కి కెప్టెన్సీ ఇవ్వాలనే వాదన మొదలవుతుంది.

ఒకవేళ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఫెయిల్ అయితే, ‘హిట్ మ్యాన్’ కంటే విరాట్ కోహ్లీయే బెటర్ అంటూ అతనికి మళ్లీ కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ కూడా రావచ్చు...

అన్నింటికీ మించి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌కి వన్డేల్లో, టీ20ల్లో ప్లేస్ లేకపోయినా అక్కడ పెద్ద విషయమేమీ కాదు. అదే భారత టెస్టు సారథి విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియాలో చోటు దక్కకపోతే ఇక్కడ బీభత్సమైన రచ్చ మొదలైపోతుంది...

అదీకాక భారత మహిళా జట్టు విషయంలో ఈ ద్వంద్వ కెప్టెన్ల సిద్ధాంతం ఏ మాత్రం కలిసి రాలేదు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మిథాలీరాజ్, ఆ బాధ్యతలను హర్మన్ ప్రీత్ కౌర్‌కి అందించింది..

అయితే జట్టులో సీనియర్ మోస్ట్ ప్లేయర్ అయిన మిథాలీరాజ్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుందనే కారణంగానే టీ20 వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్‌ని టీమ్‌ నుంచి తొలగించింది హర్మన్ ప్రీత్...

అప్పట్లో ఈ విషయం మీద చాలా పెద్ద చిచ్చు రేగడంతో టీ20ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది మిథాలీరాజ్. టీ20లకు హర్మన్‌ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంటే, వన్డే, టెస్టులకు మిథాలీరాజ్ కెప్టెన్‌గా ఉంది...

ఇప్పుడు భారత పురుషుల జట్టు విషయంలో కూడా ఈ ఇద్దరు కెప్టెన్ల ఫార్ములా ఎలాంటి మార్పులు, చీలికలు తీసుకువస్తుందోనని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు...

click me!