ఆ విషయం తెలిసినా విరాట్ కోహ్లీ డిక్లేర్ చేయలేదా... అజాజ్ పటేల్ వికెట్లు తీస్తుంటే...

First Published Dec 4, 2021, 4:39 PM IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు మంచి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తొలి టెస్టులో ఆఖరి వికెట్ తీయలేక, డ్రాతో సరిపెట్టుకున్న టీమిండియా, ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటక జట్టును 62 పరుగులకే ఆలౌట్ చేసింది...

భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనకి తోడు, స్పిన్‌కి పిచ్ అద్భుతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై మహ్మద్ సిరాజ్... మొదటి మూడు వికెట్లు తీసి టాపార్డర్‌ను కకావికలం చేశాడు...

ఆ తర్వాత భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా, జయంత్ యాదవ్ ఓ వికెట్ తీయడంతో 62 పరుగులకే ఆలౌట్ అయ్యింది న్యూజిలాండ్...

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 325 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. మయాంక్ అగర్వాల్ 150 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 52, శుబ్‌మన్ గిల్ 44 పరుగులు చేశారు...

న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ పదికి పది వికెట్లు పడగొట్టి... ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109.5 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే, అందులో 47.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అజాజ్ పటేల్ 12 మెయిడిన్లతో 119 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు...

న్యూజిలాండ్‌ తరుపున అత్యుత్తమ గణాంకాలు నమోదుచేసిన అజాజ్ పటేల్, 1956లో జిమ్ లాకర్, 1999లో పాకిస్తాన్‌పై అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు.

అనిల్ కుంబ్లే కూడా తన క్లబ్ లోకి అజాజ్ పటేల్‌కి సాదరంగా స్వాగతం పలకగా, భారత జట్టు 8వ వికెట్ కోల్పోయిన తర్వాత డిక్లేర్ చేయాలంటూ స్టేడియంలోని ఫ్యాన్స్ గోల చేయడం మొదలెట్టారు...

స్టేడియంలోనే ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ టీమిండియా ఇక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, అజాజ్ పటేల్‌కి 10కి 10 వికెట్ల రికార్డు దక్కకుండా చూడాలని అభిమానులు డిమాండ్ చేశారు.

భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకి ఉన్న మనస్పర్థల గురించి తెలిసిందే. కోహ్లీ కారణంగానే కుంబ్లే హెడ్ కోచ్ పదవి నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది...

ఆ పాత కక్ష్యలు మనసులో పెట్టుకుని, అజాజ్ పటేల్ 10 వికెట్ల చేరువలో ఉన్నప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదని, అనిల్ కుంబ్లే స్థానంలో అశ్విన్ లేదా చాహాల్ ఉండి ఉంటే... ఇలా చేసేవాడా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు...

అయితే భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి తొలి ఇన్నింగ్స్‌లో 450-500 స్కోరేమీ చేయలేదు. చేసిందే 325 పరుగులు. అలాంటప్పుడు ప్రత్యర్థి ఆటగాడి కోసం ఇన్నింగ్స్ ఎలా డిక్లేర్ చేస్తారు?

అయినా ప్రత్యర్థి జట్టు ఆటగాడికి రికార్డు దక్కకూడదని చెప్పి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ఇలా ఆలోచించొచ్చు కాక, కానీ టీమిండియా అలా ఎప్పుడూ చేయదు.

అది కూడా భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఆడుతున్నప్పుడు క్రీడా స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించాలని కోరుకోవడం సమంజసం కాదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

click me!